Green Peas Curry : పచ్చి బఠానీలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ వీటిని నూనెలో వేయించి స్నాక్స్ రూపంలో తీసుకుంటారు. అలా చేస్తే వాటిల్లో ఉండే పోషకాలు పోతాయి. పైగా నూనె పదార్థం కనుక మనకు హాని కలుగుతుంది. అలాంటి పచ్చి బఠానీలను తిన్నా పెద్దగా మనకు ఏమీ ప్రయోజనం ఉండదు. కనుక వాటిని ఆరోగ్యకరమైన రీతిలో వండుకుని తినాలి. ఇక పచ్చి బఠానీలను ఉపయోగించి ఆరోగ్యకరమైన కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బఠానీ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి బఠానీలు – పావు కిలో, నూనె – 2 టీ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2 , తరిగిన ఉల్లిపాయలు – ఒక కప్పు, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కారం – రుచికి సరిపడా, టమాటాలు – 4, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నీళ్లు – సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బఠానీ కూర తయారీ విధానం..
ముందుగా బఠానీలను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. తరువాత టమాటాలను ముక్కలుగా కోసి ఒక జార్‌లో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో లేదా కుక్కర్ లో నూనె వేసి కాగాక జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తరువాత ముందుగా పక్కకు పెట్టుకున్న బఠానీలను, చిటికెడు ఉప్పును వేసి బాగా కలిపి మధ్యస్థ మంటపై 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల తరువాత ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న టమాట పేస్ట్ ని వేసి బాగా కలుపుకోవాలి. టమాట పేస్ట్ కొద్దిగా వేగిన తరువాత రుచికి పరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత చివరగా కొత్తిమీరను వేసి తగినన్ని నీళ్లను పోసి బఠానీలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ లో వండే వారు 3 విజిల్స్ వచ్చే వరకు ఎక్కువ మంటపై ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బఠానీ కూర తయారవుతుంది. దీనిని చపాతీ, పుల్కాలు లేదా రైస్ తో కూడా తినవచ్చు. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా.
పచ్చి బఠానీల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక మనకు శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. అలాగే ఫైబర్ అధికంగా లభిస్తుంది కనుక జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా పచ్చి బఠానీలతో మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.