బ్లాక్ టీ… చాలా మంది బ్లాక్ టీ అనగానే అదేదో మనకు లభించని పదార్థం అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే బ్లాక్ టీ అంటే ఏమీ లేదు. పాలు, చక్కెర లాంటివి కలపకుండా కేవలం టీ పొడి నీటిలో వేసి మరిగించాలి. అనంతరం వచ్చే డికాక్షన్‌నే బ్లాక్ టీ అంటారు. దీన్ని తాగడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. సాధారణ టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు వాటికి బదులుగా నిత్యం బ్లాక్ టీని తాగుతుంటే దాంతో ఎన్నో అనారోగ్యాలను నయం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో బ్లాక్ టీ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా.
బ్లాక్ టీని నిత్యం తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు దూరమవుతాయి. బ్లాక్ టీలో ఉండే టానిన్స్ జీర్ణక్రియకు ఎంతగానో దోహదం చేస్తాయి. ఇవి జీర్ణాశయాన్ని శుభ్ర పరుస్తాయి. పలు రకాల విష పదార్థాలను జీర్ణాశయం నుంచి తరిమేస్తాయి. గుండె జబ్బులున్న వారు నిత్యం బ్లాక్ టీ తాగితే మంచిది. దీంతో కరోనరీ ఆర్టరీ డిస్ ఫంక్షన్ అనే సమస్య తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉన్న వారు బ్లాక్ టీ తాగినా గుండె జబ్బులు రావు. డయేరియా సమస్యతో సతమతమవుతున్న వారు ఒక కప్పు బ్లాక్ టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.
దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాస కోశ సమస్యల నుంచి బ్లాక్ టీ గట్టెక్కిస్తుంది. నిత్యం బ్లాక్ టీ తాగుతుంటే ఆయా సమస్యలు మాయమవుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు బ్లాక్ టీలో ఉన్నాయి. బ్లాక్ టీ తాగడం వల్ల అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. పొగ తాగేవారిలో వచ్చే పార్కిన్సస్ వ్యాధి నుంచి బ్లాక్ టీ రక్షిస్తుంది. నిత్యం బ్లాక్ టీ తాగుతుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయట.
బ్లాక్ టీలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి పలు క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణతులను వృద్ధి చెందనీయవు. చర్మం రక్షింపబడాలంటే నిత్యం ఒక కప్పు బ్లాక్ టీ తాగాలి. చర్మ సమస్యలు ఉన్నవారు బ్లాక్ టీ తాగితే మంచిది. దీంతో వెంట్రుకలు కూడా సంరక్షింపబడతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దృఢంగా మారుతుంది. మధుమేహం ఉన్న వారు బ్లాక్ టీ తాగితే వారి రక్తంలో ఉన్న గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. దంత సమస్యలతో బాధ పడే వారు నిత్యం ఒక కప్పు బ్లాక్ టీ తాగితే మంచిది. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.