Mint Leaves Tea : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకు కూరల్లో పుదీనా కూడా ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేస్తుంటారు. కానీ తినేటప్పుడు మాత్రం తీసేస్తుంటారు. అలా చేయరాదు. ఎందుకంటే పుదీనా ఆకుల్లో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి. కొందరు పుదీనా ఆకులతో చట్నీ, రైస్ కూడా చేస్తుంటారు. అయితే ఇలా పుదీనాను నేరుగా తీసుకోలేం.. అనుకునే వారు పుదీనాతో చేసే టీని తాగవచ్చు. దీన్ని రోజుకు రెండు కప్పుల మోతాదులో తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పుదీనా ఆకులతో టీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐదారు పుదీనా ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. కప్పున్నర నీళ్లను ఒక పాత్రలో పోసి అందులో పుదీనా ఆకులను వేసి బాగా మరిగించాలి. స్టవ్‌ను చిన్న మంటపై ఉంచి 10 నిమిషాల పాటు మరిగించాక అనంతరం ఆ నీటిని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత అందులో ఒక టీస్పూన్ తేనె కలిపి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇందులో రుచికోసం అవసరం అనుకుంటే కాస్త నిమ్మరస్ కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పుదీనా ఆకుల టీని రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు తాగాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు.
పుదీనా టీని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. చలికాలంలో మన జీర్ణశక్తి తగ్గుతుంది. మలబద్దకం వస్తుంది. కానీ పుదీనా ఆకుల టీని తాగితే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే ఈ టీని తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ సీజన్‌లో మనకు దగ్గు, జలుబుతోపాటు ఆస్తమా కూడా వస్తుంది. కానీ పుదీనా ఆకులతో చేసే టీని తాగితే ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే పుదీనా ఆకుల టీని తాగడం వల్ల దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాసన ఉండదు.
ఈ టీని తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. చర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది. కనుక చలికాలంలో పుదీనా ఆకులను, దాంతో చేసే టీని తీసుకోవడం మరిచిపోకండి. లేదంటే అనేక లాభాలను కోల్పోతారు.