Nachos Recipe : సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది స్నాక్స్‌ను తింటుంటారు. ముఖ్యంగా చిన్నారులు అయితే చిప్స్ వంటివి తింటుంటారు. అలాంటి వాటిల్లో నాచోస్ అని చెప్పి మనకు భిన్నమైన స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్యాకెట్లలో లభిస్తున్నాయి. ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది కొని తింటుంటారు. కానీ కాస్త శ్రమిస్తే ఎంతో రుచిగా వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నాచోస్‌ను ఎలా తయారు చేసుకోవాలో.. వీటికి ఏమేం పదార్థాలు కావాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
నాచోస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్) – ముప్పావు కప్పు, మైదా – 5 టేబుల్ స్పూన్లు, సోంపు – పావు టీస్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీస్పూన్, ఒరిగానో – అర టీస్పూన్, నూనె – వేయించేందుకు సరిపడా.

నాచోస్‌ను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని చపాతీ కర్రతో బాగా పలుచగా వత్తుకుని త్రికోణం ఆకారంలో వచ్చేలా కత్తితో ముక్కల్లా కట్ చేయాలి. ఇలా చేసుకున్న వాటన్నింటినీ కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీయాలి. దీంతో ఎంతో రుచికరమైన నాచోస్ రెడీ అవుతాయి. ప్యాకెట్లలో విక్రయించేవి అయితే ధర ఎక్కువగా ఉంటాయి. పరిమాణం తక్కువగా వస్తాయి. కానీ నాచోస్‌ను ఇంట్లోనే ఇలా చేస్తే.. కావల్సినన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు.