Muscle Gain Foods : అధిక బరువు సమస్యతో బాధపడే వారితో పాటు మనలో చాలా మంది బరువు తక్కువగా ఉన్నామని కూడా బాధపడుతూ ఉంటారు. ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువు ఉండడం కూడా మంచిది కాదు. బరువు తక్కువగా ఉండడం వల్ల కూడా వివిధ అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. కనుక మనం మన వయసుకు తగ్గినట్టు ఉండాల్సినంత బరువు ఉండాలి. చాలా మంది బరువు పెరగడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే వివిధ రకాల పొడులను వాడుతూ ఉంటారు. అలాగే బరువు త్వరగా పెరగాలనే ఉద్దేశ్యంతో జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల బరువు పెరిగినప్పటికి మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.
షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం కూడా ఉంది. కనుక మనం పోషకాలు కలిగిన సరైన ఆహారాన్ని తీసుకుని బరువు పెరగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు పెరగాలనుకునే వారు రాత్రి పూట ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా, ఆరోగ్యంగా బరువు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలను, ఆరోగ్యాన్ని పొందడంతో పాటు బరువు కూడా పెరగవచ్చని వారు చెబుతున్నారు. బరువు పెరగడం కసం రాత్రి పూట తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు పెరగాలనుకునే వారు రాత్రిపూట ఎక్కువగా మాంసాన్ని, చేపలను తీసుకోవాలి. చేపలల్లో ఒమెగా 3 ప్యాటీ యాసిడ్లు, క్యాలరీలు, ప్రోటీన్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంగా బరువు పెరగాలనుకునే వారికి ఇవి చక్కటి ఆహారం.
అలాగే మాంసంలో ఉండే ప్రోటీన్స్, కొవ్వులు కండ పుష్టిని కలిగించడంలో, బరువు పెరిగేలా చేయడంలో దోహదపడతాయి. అదే విధంగా బరువు పెరగాలనుకునే వారు రాత్రిపూట అన్నాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దీనిలో అధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు బరువు పెరగడంలో దోహదపడతాయి. అయితే తెల్లబియ్యంతో వండిన అన్నాన్నికి బదులుగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్ తో వండిన అన్నాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే రాత్రి పూట భోజనంలో మంచి కొవ్వులు, క్యాలరీలు ఉండే బాదంపప్పు, పల్లీలు వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు ఇతర పోషకాలు కూడా అందుతాయి. ఇక వీటితో పాటు రాత్రిపూట బంగాళాదుంపలను తీసుకునే ప్రయత్నం కూడా చేయాలి. వీటిలో పిండి పదార్థాలు, క్యాలరీలు ఎక్కువగా ఉండడంతో పాటు ఇవి సులభంగా జీర్ణమవుతాయి.
దీంతో ఆకలి త్వరగా వేస్తుంది. ఫలితంగా మనం ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. బరువు పెరగడంలో బంగాళాదుంప ఎంతో మేలు చేస్తుంది. అదే విధంగా మల్టీ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మిల్లెట్స్ తో చేసిన బ్రెడ్ వంటి వాటిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం బరువు పెరగడంతో పాటు క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి. ఈ విధంగా ఈ ఆహారాలను రాత్రిపూట తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు పెరుగుతామని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగాలనుకునే వారు పిండి పదార్థాలు, ప్రోటీన్, మంచి కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.