ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రస్తుతం నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. కేవలం ఒక్క అమెరికాలోనే ఈ బాధితుల సంఖ్య 5 నుంచి 7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇక మొత్తం అమెరికా జనాభాలో 7 నుంచి 19 శాతం మంది నిత్యం తగినంత నిద్ర పోవడం లేదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో చాలా మందికి గుండె జబ్బులు, డయాబెటిస్, స్థూలకాయం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఎవరైనా సరే ఈ అనారోగ్య సమస్యలు రాకముందే సరైన చర్యలు తీసుకోవాలి. నిత్యం సరిగ్గా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. అందుకు గాను జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతోపాటు సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. దీంతో నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. అయితే ఇందుకు మెగ్నిషియం ఎంతగానో దోహదపడుతుంది. చాలా మంది నిజానికి ఈ పోషక పదార్థం గురించి అంతగా పట్టించుకోరు. కానీ మెగ్నిషియం ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటే.. దాంతో నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
నిద్రలేమి సమస్య ఉన్నవారిలో చాలా మందికి కండరాల నొప్పులు వస్తుంటాయి. కండరాలు పట్టేసినట్లు అనిపిస్తాయి. అలాగే తీవ్రమైన అలసట, కంగారు, ఆందోళన వంటి సమస్యలు ఉంటాయి. దీంతోపాటు జ్ఞాపకశక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. ఇవన్నీ నిజానికి నిద్రలేమికి సూచనలే. ఈ లక్షణాలు ఉన్నవారు నిద్రలేమిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దీంతో ఆటోమేటిగ్గా ఆయా సమస్యలు కూడా తగ్గుతాయి. అందుకు మెగ్నిషియం దోహదపడుతుంది.
డయాబెటిస్, పాంక్రియాటైటిస్, హైపర్ థైరాయిడిజం, కిడ్నీ వ్యాధులు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వ్యాధులు, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ తదితర వ్యాధులు ఉన్నవారిలో సహజంగానే మెగ్నిషియం లోపం వస్తుంటుంది. అలాగే ఆల్కహాల్, సోడా, కాఫీ వంటి డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకున్నా మెగ్నిషియం లోపిస్తుంది. దీంతోపాటు డై యురెటిక్స్ తీసుకునేవారు, రుతుస్రావం తీవ్రంగా అయ్యే మహిళలు, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు, చెమట బాగా పట్టేవారికి కూడా మెగ్నిషియం లోపిస్తుంది. కనుక ఎవరైనా ఈ విభాగాలకు చెందిన వారు ఉంటే మెగ్నిషియం లోపం పట్ల జాగ్రత్త వహించాలి. నిత్యం తీసుకునే ఆహారంలో మెగ్నిషియం ఉండేలా చూసుకోవాలి. అలాగే నిద్ర సరిగ్గా పోయే ప్రయత్నం చేయాలి.
రోజుకు ఎవరికి, ఎంత మెగ్నిషియం అవసరం..?
* పురుషులకు – 400 – 420 మిల్లీగ్రాములు
* మహిళలకు – 310 – 320 మిల్లీగ్రాములు
మార్కెట్‌లో మనకు మెగ్నిషియం సప్లిమెంట్లు కూడా లభిస్తాయి. అయితే వాటిని మోతాదుకు మించి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వికారం, కడుపులో నొప్పి, డయేరియా వంటి సమస్యలు వస్తాయి. దీంతోపాటు కొన్ని సమయాల్లో అసాధారణ రీతిలో గుండె కొట్టుకోవడం, కార్డియాక్ అరెస్ట్ కూడా సంభవించి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక స్త్రీ, పురుషులు ఎవరైనా సరే.. నిత్యం 350 మిల్లీగ్రాముల మోతాదులో మెగ్నిషియం అందేలా చూసుకుంటే.. ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఏ పదార్థాల్లో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది ?
అవకాడోలు, అరటిపండ్లు, పాలకూర, జీడిపప్పు, బాదంపప్పు, ఇతర నట్స్, బ్రౌన్ రైస్, తృణ ధాన్యాలు, విత్తనాలు, బీన్స్, పప్పు దినుసులు, పచ్చి బఠానీలు, శనగలు, పాలు, పెరుగు, సోయా పిండి, ఇతర సోయా ఉత్పత్తులలో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మెగ్నిషియం లోపం రాకుండా చూసుకోవచ్చు. దీంతోపాటు అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365