Periods Pain : నెలసరి సమయంలో స్త్రీలు పొత్తికడుపులో విపరీతమైన నొప్పిని అనుభవిస్తూ ఉంటారు. అలాగే నడుము నొప్పితో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. నెలసరి సమయంలో గర్భాశయ కండరాలు సంకోచించడం వల్ల ఈ నొప్పి కలుగుతుంది. నొప్పితో పాటు తల తిరిగినట్టుగా ఉండడం, వాంతులు, తలనొప్పి, డయేరియా వంటి లక్షణాలు కూడా నెలసరి సమయంలో కొందరు స్త్రీలల్లో కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది స్త్రీలు ఈ నొప్పిని తగ్గించుకోవడానికి రకరకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటారు. ఇంటి చిట్కాలతో పాటు నెలసరి సమయంలో స్త్రీలు ఈ మూడు పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పోషకాలను తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో కలిగే ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుందని వారు చెబుతున్నారు.
నెలసరి సమయంలో కలిగే ఈ నొప్పిని తగ్గించే పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి సమయంలో కలిగే నొప్పిని తగ్గించడంలో మెగ్నీషియం మనకు సహాయపడుతుంది. శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉండడం వల్ల ఈ నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం కండరాలకు విశ్రాంతి కలిగించడంతో పాటు నొప్పిని కలిగించే ప్రోస్టాగ్లాండిన్ లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. నెలసరి సమయంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, అరటి పండు, ఉసిరికాయ, అవకాడో వంటి వాటిని తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పుల తీవ్రత తగ్గుతుంది. అదే విధంగా శరీరంలో క్యాల్షియం స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల కూడా కండరాల నొప్పులు మరియు సంకోచాలు ఎక్కువగా ఉంటాయి. కాల్సిఫెరోల్ లేదా విటమిన్ డి యొక్క క్రియాశీల రూపం నొప్పిని కలిగించే ప్రోస్టాగ్లాండిన్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. శరీరంలో తగినంత విటమిన్ డి, అలాగే క్యాల్షియం ఉండడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పుల తీవ్రత తక్కువగా ఉంటుంది.
పుట్ట గొడుగులు, కోడిగుడ్డు పచ్చసొన, సాల్మన్ చేపలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఎండలో కూర్చోవడం వల్ల కూడా తగినంత విటమిన్ డి ని పొందవచ్చు. అలాగే విటమిన్ ఇ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి అరాకిడోనిక్ యాసిడ్ ( కొవ్వు ఆమ్లం) ను విడుదలను నిరోధించడంతో పాటు అది ప్రోస్టాగ్లాండిన్ గా మారకుండా అడ్డుకుంటుంది. దీంతో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. పల్లీలు, బాదంపప్పు, కివీ, బ్రకోలి, వివిధ రకాల గింజల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు నెలసరి సమయంలో ఈ మూడు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల నొప్పుల నుండి నెలసరి సమయంలో కనిపించే లక్షణాల నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.