Strength : మనం ఆహారంగా తీసుకునే చిరు ధాన్యాల్లో రాగులు ఒకటి. ఎంతో కాలంగా వీటిని మనం ఆహారంగా తీసుకుంటున్నాం. రాగుల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. రాగులను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాగి జావను తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుందని చాలా మంది రాగిజావను తాగుతూ ఉంటారు. ఆమ్లాత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని పెంచే గుణాలు రాగుల్లో అధికంగా ఉంటాయి. రాగుల్లో క్యాల్షియం, పొటాషియం పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల రాగుల్లో 364 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 443 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. ఈ పోషకాలు శరీరంలోకి వెళ్లిన తరువాత పొట్టలో ఉండే ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారాత్వాన్ని పెంచి పొట్టలో వేడిని, ఉడుకుదనాన్ని తగ్గిస్తాయి.
అలాగే ఈ రాగి జావ రక్తంలో ఉండే ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని పెంచుతాయి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోని వారి రక్తంలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో ఆమ్లత్వం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకల నుండి క్యాల్షియం రక్తంలో కలుస్తుంది. దీంతో ఎముకలు గుళ్లబారడం, బలహీనపడడం వంటివి జరుగుతాయి. రక్తంలో క్షారత్వం ఎక్కువగా ఉంటేనే రక్తం ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడే శరీరంలో రక్షణ వ్యవస్థ బాగుంటుంది. రక్తంలో ఆమ్లత్వాన్ని తగ్గించడంలో క్యాల్షియం ఎంతో దోహదపడుతుంది. రాగి జావను తాగడం వల్ల దీనిలో ఉండే క్యాల్షియం రక్తంలో ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని పెంచుతుంది. దీంతో ఎముకల్లో ఉండే క్యాల్షియం రక్తంలో కలవకుండా ఉంటుంది. రాగులను వేయించి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఈ రాగి పొడితో జావను చేసుకుని తాగడం వల్ల పొట్టలో వేడి తగ్గడంతో పాటు ఎముకలు కూడా ధృడంగా మారతాయి.
ఈ ప్రయోజనాలతో పాటు రాగులను తీసుకోవడం వల్ల మనం అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రాగుల్లో 11 గ్రాముల ఫైబర్, 5 మిల్లీ గ్రాముల ఐరన్, 15 మిల్లీ గ్రాముల సిలీనియం, 35 మైక్రో గ్రాముల ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. రాగులతో జావను చేసుకుని తాగడం వల్ల శరీరంలో రక్షణ వ్వవస్థ మెరుగుపడుతుంది. జీర్ణ వ్వవస్థ మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు రాగి జావను తీసుకోవడం వల్ల తగినంత ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. అలాగే బాలింతలు ఈ రాగిజావను తీసుకోవడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ విధంగా రాగులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయని వీటితో జావను చేసుకుని తాగడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.