Bread Gulab Jamun : రుచిగా ఉండడంతో పాటు చాలా తక్కువ సమయంలో అయ్యే తీపి వంటకాలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గులాబ్ జామున్. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. గులాబ్ జామున్ ను చేయడం చాలా తేలికగా చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ఇన్ స్టాంట్ గులాబ్ జామున్ మిక్స్ తో వీటిని మనం తయారు చేస్తూ ఉంటాం. కేవలం ఇన్ స్టాంట్ మిక్స్ తోనే కాకుండా బ్రెడ్ తో కూడా మనం గులాబ్ జామున్ లను తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే ఈ గులాబ్ జామున్ లు కూడా సాధారణ మిక్స్ తో చేసే గులాబ్ జామున్ ల వలె చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. బ్రెడ్ తో అప్పటికప్పుడు రుచిగా, చాలా తక్కువ సమయంలో గులాబ్ జామున్ లను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ గులాబ్ జామున్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 6, పంచదార – 100 గ్రా., పాలు – 50 ఎమ్ ఎల్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, నీళ్లు – రెండు కప్పులు, దంచిన యాలకులు – 4.
బ్రెడ్ గులాబ్ జామున్ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ కు ఉన్న నల్లటి అంచులను తీసేసి వాటిని ముక్కలుగా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత వాటిని చేత్తో నలుపుతూ పొడి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలను పోస్తూ మెత్తగా పిండిలా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత గిన్నెలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే యాలకులు వేసి కలపాలి. ఈ పంచదారను లేత తీగపాకం కంటే తక్కువగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బ్రెడ్ ఉండలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి.
తరువాత వీటిని తీసి పాకంలో వేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకున్న తరువాత పంచదార పాకాన్ని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక అర గంట తరువాత వీటిని గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ గులాబ్ జామ్ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు, పండుగలకు ఇలా చాలా తక్కువ సమయంలో అయ్యేలా బ్రెడ్ గులాబ్ జామున్ ను తయారు చేసుకుని తినవచ్చు. బ్రెడ్ తో చేసే ఈ గులాబ్ జామున్ ను కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.