మనలో అధిక శాతం మందికి భోజనం చేయగానే తీపి పదార్థాలను తినే అలవాటు ఉంటుంది. కొందరు స్వీట్లను చూస్తే చాలు, ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడు వాటిని లాగించేద్దామా ? అని ఆశగా ఎదురు చూస్తుంటారు. స్వీట్లను చూస్తే చాలు వెంటనే తినేస్తారు. ఎంత తినొద్దని కోరికను అణచుకుందామనుకున్నా.. ఆ పనిచేయలేరు. తీపి రుచి అంటే పడి చచ్చిపోతారు. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను తీపికి బదులుగా తీసుకోవచ్చు. దీంతో తీపి తినాలనే కోరిక నశిస్తుంది. తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. సోంపు గింజలు
భోజనం చేసిన వెంటనే తీపి పదార్థాలకు బదులుగా సోంపు గింజలను తినాలి. దీంతో తీపి తినాలనే యావ తగ్గుతుంది. సోంపు గింజలను నీటిలో వేసి మరిగించిన డికాషన్‌ను కూడా తాగవచ్చు. దీని వల్ల తీపి తినాలనే కోరిక నశించడంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ సమస్య ఉండదు. మలబద్దకం తగ్గుతుంది. కనుక భోజనం చేశాక ఒక టీస్పూన్ సోంపును తినడం అలవాటు చేసుకోవాలి.
2. పండ్లు
అరటి పండ్లు, ద్రాక్ష, సపోటా, కివీ వంటి పండ్లను భోజనం చేసిన తరువాత తినవచ్చు. దీంతో తీపి తినాలనే ఆశ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
3. డార్క్ చాకొలెట్
డార్క్ చాకొలెట్ తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. కానీ అది నిజానికి బరువును తగ్గిస్తుంది. భోజనం చేశాక దీన్ని తింటే తీపి తినాలనే యావ తగ్గుతుంది. పైగా డార్క్ చాకొలెట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక మనకు మేలు చేస్తాయి. గుండెను సంరక్షిస్తాయి.