Forgetfulness : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో మతిమరుపు సమస్య కూడా ఒకటి. విపరీతమైన పని ఒత్తిడి, గాభరా వల్ల చేతిలో ఉన్న వస్తువులను సైతం ఎక్కడో పెట్టి మరిచిపోతుంటారు. ఆ వస్తువుల కోసం గంటలు గంటలు వెతుకుతుంటారు. మనలో చాలా మంది పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. మతిమరుపు సమస్యను కూడా చిన్నదిగా తీసుకోకూడదు. ఇదే అల్జీమర్స్ కు దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మతిమరుపును, అల్జీమర్స్ ను వివిధ రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల నివారించుకోవచ్చు.
ఈ ఉత్తమ ఆహారాలను ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మతిమరుపును తగ్గించుకోవచ్చు. మతిమరుపును దూరం చేసే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ ఆహారంలో ఏదో ఒక ఆకుకూరను తీసుకోవాలి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. కూరగాయలు, ఆకుకూరలు, బ్రోకోలి, కాలీఫ్లవర్, కోడిగుడ్లు, మొలకెత్తిన విత్తనాల వంటివి మెదడుకు కావల్సిన శక్తిని ఇవ్వడంతోపాటు శరీరానికి కావల్సిన పోషకాలను కూడా ఇస్తాయి. అలాగే బాదం పప్పు, వాల్ నట్స్ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్యకరం. అలాగే మెదడును ఆరోగ్యంగా ఉంచే కొవ్వులను కలిగి ఉంటాయి. బాదం, వాల్ నట్స్ ను ఎక్కువగా తీసుకునే వారిలో మెదడు సమర్థవంతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా మతిమరుపుతో బాధపడే వారు బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్, క్రాన్ బెర్రీస్ వంటి వాటిని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను కలిగి ఉండే ఆహారాల్లో చేపలు కూడా ఒకటి. చేపలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. అంతేకాకుండా చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మానసిక ఆందోళన కూడా దూరం అవుతుంది. అదే విధంగా ప్రతిరోజూ ఏదో ఒక పుల్లటి పండును తినడం వల్ల కూడా మతిమరుపు సమస్య నుండి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జ్ఞాపక శక్తి పెరిగి మతిమరుపు సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.