సాధారణంగా ఒక్కొక్కరి శరీరం ఒక్కో విధంగా నిర్మాణమై ఉంటుంది. అందువల్ల అందరికీ అన్ని పదార్థాలు నచ్చవు. ఇక కొందరికి కొన్ని పదార్థాలు పడవు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిల్లో కడుపు నొప్పి ఒకటి. పడని ఆహారాలను తింటే కొందరికి అలర్జీలు వస్తాయి. కొందరికి విరేచనాలు అవుతాయి. కానీ కొందరికి కడుపునొప్పి వస్తుంది. మరి కడుపు నొప్పికి కారణం అయ్యే ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
* పచ్చి కూరగాయలను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే అవి అందరికీ పడవు. కొందరికి వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. కనుక ఇలా గనక జరిగితే కూరగాయలను పచ్చిగా తినరాదు. ఉడికించి తినాలి.
* ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకుంటే జీర్ణ సమస్యలు ఉండవు. మలబద్దకం తగ్గుతుంది. కానీ కొందరికి ఫైబర్ సరిగ్గా జీర్ణం కాదు. దీంతో కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, చిరు ధాన్యాల్లో ఉంటుంది. కనుక వీటిని తింటే కడుపు నొప్పి వస్తుందని భావించే వారు వీటిని తినరాదు.
* చూయింగ్ గమ్‌లు కొందరికి పడవు. వీటిని నమిలినా కడుపు నొప్పి కొందరికి వస్తుంది. అలాగే ప్రోటీన్ బార్స్‌ను తింటే కొందరికి జీర్ణ సమస్యలు వస్తాయి. వీటితోపాటు పాలు, పాల ఉత్పత్తుల వల్ల కూడా కొందరికి కడుపు నొప్పి వస్తుంటుంది.
* శీతల పానీయాలు, సోడాలను తాగినా, మద్యం సేవించినా, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తిన్నా.. కడుపు నొప్పి వస్తుంది.
అయితే ఈ సమస్య వచ్చిన వారు తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి. వాము, జీలకర్ర, సోంపు గింజలు వంటి వాటిని ఉపయోగించాలి. దీంతో కడుపు నొప్పి నుంచి బయట పడవచ్చు.