మనలో చాలా మంది చెవులను శుభ్రం చేసుకునేందుకు కాటన్ స్వాబ్స్‌ను ఉపయోగిస్తుంటారు. చెవుల్లో వాటిని పెట్టి మెలితిప్పి మరీ చెవులను శుభ్రం చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 68 శాతం మంది ఇలా చెవులను శుభ్రం చేస్తారని గణాంకాలు చెబుతున్నాయి. అయితే నిజానికి ఇలా కాటన్ స్వాబ్స్ ను ఉపయోగించి చెవులను శుభ్రం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు.
మన చెవుల్లో గులిమి ఎప్పటికప్పుడు తయారవుతుంది. చెవులు పొడిగా మారకుండా, లోపల వ్యర్థాలు పేరుకుపోకుండా ఉండేందుకు అది సహాయ పడుతుంది. ఈ క్రమంలోనే చెవుల్లో గులిమి తయారవుతున్న కొద్దీ దానంతట అదే చెవుల నుంచి బయటకు వస్తుంది. కనుక మనం చెవులను శుభ్రం చేయాల్సిన పనిలేదు.
అయితే చాలా మంది చెవుల్లోని గులిమి తీసేందుకు కాటన్ స్వాబ్స్ ను వాడుతుంటారు. నిజానికి ఇలా చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే గులిమి తీసేందుకు కాటన్ స్వాబ్స్ ను చెవిలో పెడితే గులిమి మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఏర్పడుతుంది. అలా గులిమి ఇంకా లోపలికి వెళితే బయటకు రావడం కష్టతరమవుతుంది. దీంతో సమస్యలు వస్తాయి.
చెవుల్లో గులిమి బాగా లోపలికి వెళితే చెవుల్లో నొప్పి, ఇన్‌ఫెక్షన్, చెవుల్లో ఏదో అడ్డం ఉన్నట్లు అనిపించడం, శబ్దాలు, మాటలు సరిగ్గా వినిపించకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
గులిమి తీసే నెపంతో చెవుల్లో కాటన్ స్వాబ్స్ ను పెడితే అవి ఒక్కోసారి చెవుల లోపలి భాగాలకు హాని కలిగించే అవకాశాలు ఉంటాయి. చెవుల లోపలి భాగం చాలా సున్నితంగా ఉంటుంది. కాటన్ స్వాబ్ తాకితే ఆ భాగాలకు గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయి.
తరచూ చెవుల్లో కాటన్ స్వాబ్స్ పెట్టి శుభ్రం చేస్తుంటే చెవి ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కనుక కాటన్ స్వాబ్స్ ను ఉపయోగించరాదు. మన చెవులు సహజసిద్ధంగా వాటంతట అవే శుభ్రమవుతాయి. వాటి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ ఎవరైనా వాటిని శుభ్రం చేయదలిస్తే కాటన్ స్వాబ్స్‌కు బదులుగా బేబీ ఆయిల్, మినరల్ ఆయిల్ లేదా గ్లిజరిన్ వంటి వాటిని వాడవచ్చు. లేదా ఆముదం కూడా ఉపయోగించవచ్చు. అంతేకానీ కాటన్ స్వాబ్స్ ను వాడరాదు.