Virigi Kayalu : విరిగి కాయల చెట్టు.. ఈ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. దీనిని విరిగి చెట్టు, నక్కెర, బంక నక్కెర, బంక కాయలు, బంక కాయల చెట్టు ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ నక్కెర చెట్టు బొరాగినిస్ కుంటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం కార్డియా డైకోటమా. విరిగి కాయల చెట్టు మూడు నుండి నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్టు చాలా విశాలంగా పెరుగుతుంది. ఈ చెట్టు మనకు గ్రామాల్లో, రోడ్ల పక్కన ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ విరిగి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. విరిగి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో, అలాగే పండిన తరువాత లేత ఎరుపు రంగులోకి మారుతాయి. వీటి కాయల లోపల కండ కలిగిన తీపి పదార్థం ఉంటుంది. అందుకే దీనిని బంక కాయల చెట్టు అని పిలుస్తారు. ఈ విరిగి కాయలను చాలా మంది ఇష్టంగా తింటారు.
అయితే ఈ పండ్లు అరగడానికి చాలా సమయం పడుతుంది. కనుక వీటిని తక్కువ మోతాదులో అనగా రోజుకు 5 నుండి 10 విరిగి పండ్లను మాత్రమే తీసుకోవాలి. అయితే చాలా మంది ఈ విరిగి చెట్టును మన సాంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారని తెలియదు. ఈ చెట్టు ఆకులు, వేర్లు, బెరడు, పండ్లు, విత్తనాలు అన్ని కూడా యాంటీ బయాటిక్, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను అధికంగా కలిగి ఉంటాయి. ఈ విరిగి పండ్లను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ విరిగి పండ్లల్లో క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్స్ తో పాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ విరిగి పండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. చాలా మంది ఈ విరిగి కాయలతో పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటారు. విరిగి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల రక్త దోషాలు కూడా తొలగిపోతాయి.
ఈ నక్కెర పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయని నిపుణులు జరిపిన పరిశోధనల్లో తేలింది. మలబద్దకం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడే వారు ఈ పండ్లను తినడం వల్ల సమస్యలు తగ్గు ముఖం పట్టడంతో పాటు సుఖ విరోచనం కూడా అవుతుంది. అలాగే విరిగి చెట్టు ఆకులను కూడా కూరగా వండుకుని తింటారు. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ చెట్టు బెరడును ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. తరువాత దీనికి తగినన్నికలిపి పేస్ట్ లా చేసుకుని సమస్య ఉన్న చోట చర్మం పై రాసుకోవాలి. ఈ చెట్టు విత్తనాలను మెత్తగా చేసుకుని దురద ఉన్న చోట రాయడం వల్ల దురద కూడా తగ్గుతుంది. ఈ విరిగి పండ్లను ఎండబెట్టి వాటితో లడ్డూలను కూడా తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన లడ్డూలను తినడం వల్ల శరీరానికి శక్తి, బలం చేకూరుతుంది. విరిగి చెట్టు బెరడుతో కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల స్త్రీలల్లో వచ్చే నెలసరి సమస్యలు తగ్గుతాయి. ఇలాగే ఈ కషాయంతో గాయాలను శుభ్రం చేసుకుంటే గాయాలు త్వరగా మానుతాయి.
అదే విధంగా విరిగి చెట్టు బెరడుతో చేసిన కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి సంబంధిత సమస్యలు తగ్గి దంతాలు, చిగుర్లు ఆరోగ్యంగా తయారవుతాయి. గొంతులో శ్లేష్మం, కఫం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రోజుకు 5 నుండి 10 నక్కెర పండ్లను తినడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యంతో పాటు వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ చెట్టు లేత ఆకులను సేకరించి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని తలపై ఉంచి కట్టుకట్టడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఈ విధంగా విరిగి చెట్టు మన ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ పండ్లను తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.