Bellam Kudumulu : మనం బెల్లంతో రకరకాల తీపి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బెల్లాన్ని ఉపయోగించడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. రక్తహీనత సమస్యను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో బెల్లం మనకు సహాయపడుతుంది. ఈ బెల్లాన్నిఉపయోగించే చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ బెల్లంతో రుచిగా, త్వరగా చేసుకోదగిన తీపి వంటకాల్లో కుడుములు ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. ఈ బెల్లం కుడుములను రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం కుడుముల తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – 100 ఎమ్ ఎల్, నానబెట్టిన శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము – ముప్పావు కప్పు, పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, తడి బియ్యం పిండి – ఒక కప్పు.
బెల్లం కుడుముల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక శనగపప్పు వేసి ఉడికించాలి. శనగపప్పు మెత్తగా ఉడికిన తరువాత బెల్లం తురుము వేసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత దీనిని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. దీనిని ముద్దగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. పిండి కొద్దిగా గట్టి పడగానే స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. పిండి కొద్దిగా గోరు వెచ్చగా అయిన తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ బాగా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకు కావల్సిన ఆకారంలో కుడుముల్లాగా వత్తుకోవాలి.
ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి. తరువాత ఇడ్లీ ప్లేట్ లకు నెయ్యి రాసి అందులో కుడుములను ఉంచి మూత పెట్టి 8 నుండి 10 నిమిషాల పాటు మధ్యస్ధ మంటపై ఉడికించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం కుడుములు తయారవుతాయి. ఈ కుడుములు రెండు నుండి మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ బెల్లం కుడుములను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు ఆరోగ్యానికి మేలు చేసేలా ఇలా బెల్లం కుడుములను తయారు చేసుకుని తినవచ్చు. అలాగే ఈ బెల్లం కుడుములను ప్రసాదంగా కూడా తయారు చేసుకోవచ్చు.