Ants : మన ఇంట్లోకి వచ్చే రకరకాల కీటకాల్లో చీమలు ఒకటి. ఇంట్లోకి వచ్చే చీమలు మనకు ఎంతో చికాకును కలిగిస్తూ ఉంటాయి. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ చీమలు ఉంటాయని చెప్పవచ్చు. మన వంటింట్లో ఉండే ఆహార పదార్థాలన్నింటికి దాదాపు ఈ చీమలు పడుతూ ఉంటాయి. ఈ చీమల సమస్య నుండి బయటపడడానికి మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఒక చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి మనం చీమల నుండి విముక్తిని పొందవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల ఇంట్లో క్రిమి కీటకాలు, బ్యాక్టీరియా వంటివి కూడా నశిస్తాయి. చీమలను నివారించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం పిమ్మకాయ పొట్టును ఉపయోగించాల్సి ఉంటుంది. దోరగా పండిన ఒక నిమ్మకాయను తీసుకుని దానిపై ఉండే తొక్కను తురమాలి. ఇలా తురిమిన నిమ్మ తొక్కను ఒక రోట్లోకి తీసుకోవాలి. తరువాత దీనిలో రెండు టీ స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. తరువాత ఇందులో 5 లేదా 6 లవంగాలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తని పొడిగా దంచుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. ఈ పొడిని నీటిలో వేసి కలపాలి. తరువాత ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి సువాసన రావడంతో పాటు నేలపై ఉండే క్రిములు, బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. ఇలాగే ఇంట్లో చీమలు కూడా బయటకు పోతాయి. అలాగే ఈ పొడిని నీటిలో వేసి బాగా కలపాలి.
తరువాత ఈ నీటిని స్ప్రే బాటిల్ లో వేసి చీమలు ఉన్న చోట స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చీమలు తొలగిపోతాయి. అలాగే కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల కూడా మనం ఈ చీమల బెడద నుండి బయటపడవచ్చు. పంచదార డబ్బాలో కొన్ని లవంగాలను వేసి ఉంచడం వల్ల పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి. నల్ల చీమలు ఉన్న చోట మన ఇంట్లో ఉండే ఉప్పును చల్లాలి. ఇలా చేయడం వల్ల కూడా చీమలు తొలగిపోతాయి. ఒక్కోసారి ఇంట్లోకి ఎక్కువ మొత్తంలో చీమలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ప్రదేశంలో దోసకాయ తొక్కను ఉంచాలి.
ఇలా చేయడం వల్ల చీమలు ఆ ప్రదేశం నుండి తక్షణమే తొలగిపోతాయి. అలాగే తీపి పదార్థాలను నిల్వ చేసి డబ్బాల చుట్టూ ఆముదం నూనెను రాయాలి. ఇలా రాయడం వల్ల తీపి వంటకాలకు చీమలు పట్టకుండా ఉంటాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మన ఇంట్లోకి చీమలు రాకుండా చూసుకోవచ్చు. చీమలను తొలగించడానికి రసాయనాలు కలిగిన పదార్థాలను వాడడం వల్ల దుష్ప్రభావాలు ఎదురవుతాయి. కనుక ఇలా సహజ సిద్ద చిట్కాలను ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా చీమల సమస్య నుండి బయట పడవచ్చు.