Boiled Eggs : మనలో చాలా మంది కోడిగుడ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఏం కూర లేకపోతే త్వరగా అవుతుందని చెప్పి 2 కోడిగుడ్లను కొట్టి వేపుడు చేసి అన్నంలో కలిపి తింటారు. కోడిగుడ్లను వివిధ రకాలుగా కూడా వండుకుని తింటారు. ఎలా వండినా సరే కోడిగుడ్డు చాలా మందికి ఫేవరెట్ ఆహారం అని చెప్పవచ్చు. అయితే కోడిగుడ్లను ఇతర రూపాలలో కంటే ఉడకబెట్టి మాత్రమే తీసుకోవాలని, అప్పుడే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కోడిగుడ్లను ఉడకబెట్టి తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్లు ఉంటాయి. అలాగే మన శరీరానికి అవసరం అయిన 9 అమైనో యాసిడ్లు గుడ్లలో ఉంటాయి. ఇవి కండరాలను రిపేర్ చేయడంతోపాటు కండరాల నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరాన్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. కోడిగుడ్డులో 6 గ్రాముల మేర ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి బలాన్నిస్తుంది. శక్తి కోరుకునే వారు రోజుకు ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తినవచ్చు. అలాగే చిన్నారులకు కూడా తినిపించవచ్చు. దీంతో వారిలో ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.
ఎముకల బలానికి..
ఉడకబెట్టిన కోడిగుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డితోపాటు విటమిన్ బి2 (రైబోఫ్లేవిన్) కూడా ఉంటాయి. విటమిన్ బి12 శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే విటమిన్ డి మనం తినే ఆహారంలో ఉండే క్యాల్షియాన్ని శరీరం సరిగ్గా శోషించుకునేలా చేస్తుంది. దీంతో ఎముకలు బలంగా మారుతాయి. అలాగే రైబోఫ్లేవిన్ మన శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుందని అంటుంటారు కానీ ఆ కొలెస్ట్రాల్ చాలా స్వల్ప మోతాదులో ఉంటుంది. అది మన ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావాన్ని చూపించదని వైద్యులు చెబుతున్నారు.
ఇక కోడిగుడ్లలో మన ఆరోగ్యానికి అవసరం అయ్యే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. కనుక కోడిగుడ్లను రోజూ ఉడకబెట్టి తింటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఉడకబెట్టిన కోడిగుడ్లలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక పెద్ద సైజు కోడిగుడ్డు ద్వారా మనకు సుమారుగా 77 క్యాలరీలు లభిస్తాయి. అయినప్పటికీ ఇవి తక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక కోడిగుడ్డును తింటే చాలు మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారాన్ని తక్కువగా తింటాము. ఫలితంగా ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది.
కంటి చూపు మెరుగు పడుతుంది..
కోడిగుడ్లలో లుటీన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. దీనివల్ల అతినీలలోహిత కిరణాల బారి నుంచి కళ్లు రక్షించబడతాయి. అలాగే వయస్సు మీద పడడం వల్ల వచ్చే కంటి శుక్లాలు, ఇతర జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. కోడిగుడ్డులో ఉండే బయోటిన్ చర్మం, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలో ఉండే జింక్, విటమిన్ ఎ, సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు. ఇలా ఉడకబెట్టిన కోడిగుడ్లను రోజూ తినడం వల్ల మనం ఎన్నో రకాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. కనుక రోజూ ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డును తినడం మరిచిపోకండి.