ప్రకృతిలో మనకు సహజసిద్ధంగా లభించే అనేక రకాల పానీయాల్లో కొబ్బరినీళ్లు ముందు వరుసలో నిలుస్తాయి. ఇవి శరీర తాపాన్ని తగ్గిస్తాయి. వేడిని తగ్గిస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సహజసిద్ధమైన ఎంజైమ్‌లు, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు వీటిలో ఉంటాయి. అందువల్ల కొబ్బరినీళ్లు మనకు ఎంతగానో మేలు చేస్తాయి. అయితే కొబ్బరి నీళ్లను రోజులో ఎప్పుడైనా తాగవచ్చు. కానీ కింద తెలిపిన సమయాల్లో తాగడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు.
నిత్యం ఉదయాన్నే పరగడుపునే కొబ్బరినీళ్లను తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరినీళ్లలో ఉండే లారిక్ యాసిడ్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మెటబాలిజంను సరిచేస్తుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. గర్భిణీలకు సహజంగానే డీహైడ్రేషన్, మలబద్దకం, వికారం, గుండెల్లో మంట వంటివి వస్తుంటాయి. ఆయా సమస్యలు తగ్గాలంటే రోజూ ఉదయాన్నే కొబ్బరినీళ్లను తాగాల్సి ఉంటుంది.
వ్యాయామం చేయడానికి ముందు కొబ్బరినీళ్లను తాగితే శక్తి బాగా లభిస్తుంది. దీంతో అలసిపోకుండా వ్యాయామం చేయవచ్చు. ఇక వ్యాయామం చేశాక కొబ్బరినీళ్లను తాగితే శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి గ్రహిస్తుంది. దీంతో అలసట, దాహం తగ్గుతాయి. శక్తి పెరుగుతుంది.
భోజనం చేయడానికి ముందు ఒక గ్లాస్ కొబ్బరినీళ్లను తాగితే జీర్ణాశయం నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారం తక్కువగా తింటాం. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ రాకుండా ఉంటుంది. తరచూ తాగుతుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్య స్థితిలో ఉంటాయి. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది.
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కొబ్బరినీళ్లను తాగడం వల్ల శరీరంపై మానసికంగా ప్రభావం పడుతుంది. దీంతో శరీరం, మనస్సు ప్రశాంతంగా మారుతాయి. బీపీ తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. కిడ్నీ సమస్యలు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
మద్యం విపరీతంగా సేవిస్తే హ్యాంగోవర్ వస్తుంది. అయితే ఈ సమస్యకు కొబ్బరినీళ్లు చక్కని పరిష్కారం చూపుతాయి. మద్యం సేవించడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో శరీరంలో నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోయి తలనొప్పి, వికారం వంటి సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లను తాగితే వెంటనే హ్యాంగోవర్ తగ్గుతుంది. ఆయా సమస్యలు తగ్గుతాయి.