Mettelu : పూర్వకాలం నుండి మనం ఆచరిస్తున్న వివాహ సంప్రదాయాలలో కాళ్లకు మెట్టెలు పెట్టుకోవడం కూడా ఒకటి. వివాహ సమయంలో మంగళసూత్రంతోపాటు స్త్రీల కాళ్లకు మెట్టెలు కూడా పెడతారు. కాళ్ల మెట్టెలను కూడా సౌభాగ్య చిహ్నంగా భావిస్తారు. స్త్రీ కి వివాహం అయ్యింది అని తెలియ చెప్పేందుకు కాళ్లకు మెట్టెలు ఒక చిహ్నం. స్త్రీ కాలి మెట్టెలను చూసి తనను తల్లిగా భావించాలని, తనతో మర్యాదగా ఉండాలని కాలి మెట్టెలు సూచిస్తాయి. వివాహిత స్త్రీలు కాలి మెట్టెలు పెట్టుకోవాలన్న ఆచారం వెనుక కూడా ఎంతో అర్థం దాగి ఉంది.
మెట్టెలు ధరించడం వెనుక అనేక రకాల ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి. చాలా మంది వివాహితులు మెట్టెలను అందం కోసం మాత్రమే పెట్టుకుంటారని భావిస్తూ ఉంటారు. కానీ మెట్టెలను ధరించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాల గురించి ఎవరికీ తెలియదు. వివాహిత స్త్రీలు కాలికి ఉన్న రెండో వేలుకు మెట్టెలను ధరిస్తారు. అన్ని వేళ్లను వదిలేసి రెండో వేలుకు మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి.. అన్న సందేహం కూడా చాలా మంది కలుగుతుంది. బొటన వేలు పక్కన ఉండే రెండో వేలు స్త్రీలకు ఆయువు పట్టు వంటిది. ఆ వేలు నుండి మన శరీరానికి ఎల్లప్పుడూ విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వేలు నేరుగా నేలకు తగలకుండా ఉండడానికి మెట్టెలు ధరించే సంప్రదాయం ప్రారంభమైందని పండితులు వివరిస్తున్నారు.
దక్ష యజ్ఞం సమయంలో తన భర్తకు జరిగిన అవమానానికి కోపోద్రిక్తురాలైన దాక్షాయణి తనకాలి రెండో వేలిని నేలకు రాసి నిప్పు పుట్టించిందని, ఆ మంటలలోనే తను కూడా దహనమైందని పురాణాలు చెబుతున్నాయి. కాలి రెండవ వేలుకు మెట్టెలు ధరించడానికి, స్త్రీ ఆరోగ్యానికి ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు. నాడీ శాస్త్రం ప్రకారం కాలి రెండవ వేలుకు, స్త్రీల గర్భాశయానికి, గుండెకు నిర్దిష్టమైన నాడుల కలయిక ఉంటుందట. కాలి రెండవ వేలుకు మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఆ వేలు మీద ఒత్తిడి పడుతుంది. దీంతో గర్భాశయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండి సంతానం కలగడానికి సులభతరమైవుతుందట. కాలి వేలుకు వెండితో చేసిన మెట్టెలను మాత్రమే ధరించాలి. ఇతర లోహాలతో చేసిన మెట్టెలను ధరించరాదు. వెండి శరీర ఉష్ణోగ్రతను సమానంగా ఉంచుతుంది. ఈ కారణాల చేత వివాహిత స్త్రీలు మెట్టెలు ధరించాలని నిపుణులు తెలియజేస్తున్నారు.