చలికాలంలో సహజంగానే చాలా మందికి చర్మం పగులుతుంటుంది. దీంతో అనేక మంది ఈ సమస్య నుంచి బయట పడేందుకు అనేక రకాల చిట్కాలను పాటిస్తుంటారు. కొందరు క్రీములు గట్రా రాస్తారు. ఇంకొందరు ఆయిల్స్ రాసుకుంటారు. అయితే వాటితోపాటు కింద తెలిపిన ఆహారాలను కూడా నిత్యం తీసుకుంటే దాంతో చర్మం పగలకుండా ఉంటుంది. అలాగే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మరి చర్మ సంరక్షణకు చలికాలంలో నిత్యం తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
క్యారెట్
క్యారెట్లలో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అలాగే బీటా కెరోటీన్ పుష్కలంగా లభిస్తుంది. దీన్ని మన శరీరం విటమిన్ ఎ కింద మార్చుకుంటుంది. ఈ క్రమంలో విటమిన్ ఎ చర్మం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో గాయాలు త్వరగా మానుతాయి. అలాగే చర్మం పగలకుండా ఉంటుంది. దీనికి తోడు చర్మానికి సహజసిద్ధంగా తేమ అందుతుంది. చర్మం మృదువుగా మారి కాంతివంతంగా కనిపిస్తుంది.
బీట్‌రూట్
నిత్యం బీట్‌రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల చర్మం ప్రకాశిస్తుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ సి ఫ్రీ ర్యాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ క్రమంలో వయస్సు మీద పడడం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. చర్మం పగలకుండా యవ్వనంగా కనిపిస్తుంది.
బ్రొకొలి
ఇందులో విటమిన్ ఎ, సిలు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. శరీర కణజాలంతోపాటు చర్మం, వెంట్రుకల కణాలు పెరిగేందుకు ఈ విటమిన్లు ఉపయోగపడతాయి. అలాగే బ్రొకొలిలో ఉండే కొల్లాజెన్ అనబడే ప్రోటీన్ చర్మ కణాలకు మరమ్మత్తులు చేస్తుంది. దీంతో చర్మం కొత్తగా మారుతుంది. బ్రొకొలిలో ఉండే బి విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చర్మాన్ని పగలకుండా చూస్తాయి.
నారింజ
నారింజ పండ్లలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మానికి మేలు చేస్తుంది. చర్మం ప్రకాశిస్తుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం పొడిబారకుండా చూస్తుంది.
దానిమ్మ
దానిమ్మ పండ్లలో నీరు అధికంగా ఉంటుంది. అందువల్ల చర్మం ఎప్పుడూ తేమగా, మృదువుగా ఉంటుంది. అలాగే చర్మానికి చక్కని వన్నెతోపాటు టోన్‌ను అందిస్తుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ ను నిర్మూలిస్తాయి. దీంతో చర్మం పగలకుండా ఉంటుంది.