మార్చి 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా రెండో దశ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ దశలో సుమారుగా 27 కోట్ల మందికి టీకాలను ఇవ్వనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లను అందిస్తున్నారు. 60 ఏళ్లకు పైబడిన వారితోపాటు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండి.. 45 ఏళ్లకు పైబడిన వారికి ఈ దశలో వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారు ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదని వైద్య నిపుణులు తెలిపారు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తీసుకున్న వారు పాటించాల్సిన జాగ్రత్తల వివరాలను వారు తెలియజేస్తున్నారు.
* ప్రస్తుతం పలు సంస్థలు అభివృద్ధి చేసిన, చేస్తున్న కరోనా వ్యాక్సిన్లు ఏవీ మనకు 100 శాతం కరోనా నుంచి రక్షణను ఇవ్వవు. చాలా వరకు వ్యాక్సిన్లు 90 శాతం వరకు మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తాయి. కనుక మనం తీసుకునే వ్యాక్సిన్ 100 శాతం మనల్ని రక్షిస్తుందని అనుకోకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
* కరోనా నేపథ్యంలో పాటిస్తున్న జాగ్రత్తలన్నింటినీ వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా పాటించాల్సి ఉంటుంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను సబ్బు లేదా హ్యాండ్ వాష్ లేదా హ్యాండ్ శానిటైజర్‌లతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలను పాటించాలి.
* కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు గాను రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారాలను ఎలాగైతే తీసుకుంటున్నారో వాటిని వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కొనసాగించాలి.
* వ్యాక్సిన్ తీసుకున్న అందరిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవు. కొందరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలు ఉంటాయి. ఇక కొందరికి తీవ్రమైన అనారోగ్యం సంభవించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇది అత్యంత అరుదుగా జరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురవుతామని అనుకోకూడదు. అయితే దురదృష్టవశాత్తూ ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయరాదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
* వ్యాక్సిన్ ను తీసుకున్నాక కరోనా సోకే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. అయితే అలా అని చెప్పి కరోనా రాదని అనుకోకూడదు.
* వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎంత కాలం వరకు మనకు కరోనా నుంచి రక్షణ లభిస్తుందనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అందువల్ల కరోనా పీడ పూర్తిగా పోయిందని తెలిసే వరకు కరోనా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.
* వ్యాక్సిన్లకు గాను రెండు డోసులను ఇస్తున్నారు. మొదటి డోస్ తీసుకున్న తరువాత సూచించిన సమయంలోగా మళ్లీ రెండో డోస్ తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదు. మొదటి డోస్ తీసుకున్నాం కదా, మాకు ఏమీ కాదులే అన్న భావనను విడిచిపెట్టాలి. తప్పనిసరిగా సూచించిన టైముకు రెండో డోసును కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
* కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కరోనా జాగ్రత్తలను పాటించడం ఎంత అవసరమో.. ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. అందుకు గాను నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటివి చేయాలి. దీంతో తీసుకున్న వ్యాక్సిన్ మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.