Foods : వేసవి కాలంలో మనకు సహజంగానే సీజనల్‌గా వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి. కొందరికి ఈ సీజన్‌లోనూ దగ్గు, జలుబు వస్తుంటాయి. ఇక ప్రతి ఒక్కరి శరీరం వేడిగా ఉంటుంది. అలాగే ఈ సీజన్‌లో వేడి కారణంగా విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు కడుపులో మంట, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తుంటాయి. ఇక కొందరు నీళ్లను తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో ఎండ దెబ్బకు గురవుతుంటారు. అయితే ఈ సమస్యలు సహజంగానే వస్తుంటాయి. కానీ కొన్ని సార్లు మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలు కూడా ఈ సమస్యలకు కారణమవుతుంటాయి. కనుక వేసవి సీజన్‌లో ఆహారాల పట్ల జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలను ఈ సీజన్‌లో అస్సలు తీసుకోకూడదు. లేదంటే సమస్యలు వస్తాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. నూనెతో చేసిన పదార్థాలను ఈ సీజన్‌లో తీసుకోరాదు. ఇవి విరేచనాలను కలిగిస్తాయి. దాహం ఎక్కువగా అయ్యేలా చేస్తాయి. దీంతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఎండ దెబ్బ తాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నూనెతో చేసిన పదార్థాలను వేసవిలో తినకూడదు.
2. ఈ సీజన్‌లో మనకు మామిడి కాయలు పుష్కలంగా లభిస్తాయి. మామిడి పండ్లను చాలా మంది ఈ సీజన్‌లో తింటుంటారు. అయితే ఒక మోస్తరుగా వీటిని తింటే ఏమీ కాదు. కానీ అధికంగా తింటే మాత్రం శరీరంలో వేడి పెరుగుతుంది. విరేచనాలు అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. కనుక మామిడి పండ్లను ఈ సీజన్‌లో తక్కువ మోతాదులో తీసుకోవాలి.
3. వేసవిలో సహజంగానే మనకు దాహం అధికంగా అవుతుంది. అయితే మద్యం సేవిస్తే ఆ దాహం ఇంకా పెరుగుతుంది. దీంతో నాలుక పొడి ఆరిపోతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. ఇది లివర్‌కు మంచిది కాదు. కనుక వేసవిలో మద్యం సేవించడం కూడా మానేయాలి.
4. ఈ సీజన్‌లో మనకు గ్యాస్ సమస్య ఎక్కువగానే ఉంటుంది. కనుక టీ, కాఫీలను తగ్గించాలి. వీటిని అధికంగా తీసుకుంటే గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి కాఫీ, టీలకు బదులుగా హెర్బల్ టీలు లేదా కొబ్బరినీళ్లు, పుచ్చకాయ జ్యూస్, తర్బూజా జ్యూస్, కీరదోస వంటి వాటిని తీసుకోవాలి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచుతాయి. దీంతో గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి.
5. కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను, మాంసాహారాలను అధికంగా తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశాలు ఈ సీజన్‌లో అధికంగా ఉంటాయి. అలాగే కడుపులో మంట కూడా వస్తుంది. కాబట్టి ఈ ఆహారాలను పరిమిత మోతాదులో తీసుకోవాలి.
6. ఇక బేకరీ పదార్థాలు, ఇతర జంక్ ఫుడ్స్‌ను తినడం కూడా మానేయాలి. ఇవి దాహం అధికంగా అయ్యేలా చేస్తాయి. శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. ఇది మనకు ఈ సీజన్‌లో మంచిది కాదు. కనుక ఈ ఆహారాలను ఎక్కువగా తినేవారు కూడా జాగ్రత్త వహించాలి.