మనకు అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర కలిగిన పండ్లలో జామ పండ్లు ఒకటి. కొందరు వీటిని పండిపోకుండా దోరగా ఉండగానే తినేందుకు ఇష్టపడుతుంటారు. వాటిని జామకాయలంటారు. అయితే జామకాయలను రోజూ తినవచ్చు. వీటిని పోషకాలకు గనిగా చెబుతారు. వీటిని రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. జామ కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను చంపుతుంది.
2. జామ కాయల్లో ఉండే విటమిన్ సి, లైకోపీన్, క్వర్సెటిన్, పాలిఫినాల్స్ ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేసి శరీర కణాలను రక్షిస్తాయి. దీని వల్ల క్యాన్సర్ కణాలు పెరగవు. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
3. డయాబెటిస్ ఉన్నవారికి జామ కాయలు చక్కని ఆహారం అని చెప్పవచ్చు. వీటిని రోజూ తినడం వల్ల షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.
4. జామ కాయల్లో సోడియం, పొటాషియం అధికంగా ఉంటాయి. అందువల్ల హైబీపీ తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
5. జామకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ తింటుంటే గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
6. జామ కాయల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లను రక్షిస్తుంది.
7. జామకాయల్లో విటమిన్ బి9 (ఫోలిక్ యాసిడ్) అధికంగా ఉంటుంది. అందువల్ల గర్భంతో ఉన్న మహిళలు జామ కాయలను రోజూ తినాలి. దీని వల్ల శిశువు ఎదుగుదల సరిగ్గా ఉంటుంది.
8. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు జామ కాయలను తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. నోటి దుర్వాసన తగ్గుతుంది.
9. ఒత్తిడి, ఆందోళనలతో సతమతం అయ్యేవారు జామ కాయలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
10. ఈ పండ్లలో ఉండే విటమిన్ బి6 మెదడును చురుగ్గా మారుస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
11. అధిక బరువు తగ్గాలనుకునే వారు జామకాయలను రోజూ తీసుకోవాలి. వీటి వల్ల అధిక బరువు సులభంగా తగ్గుతారు.
12. ఈ కాయల్లో ఉండే విటమిన్ సి, ఐరన్ వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల దగ్గు, జలుబు తగ్గుతాయి.
13. జామ కాయల్లో విటమిన్లు ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
14. జామ కాయలను తినడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. జామ పండ్లను పేస్ట్‌లా చేసి ముఖానికి ఫేస్ మాస్క్‌లా వేసుకోవాలి. 20 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
15. జామ కాయలను తినడం వల్ల ముఖంలోని కండరాలు దృఢంగా మారుతాయి. చర్మం సాగిపోకుండా ఉంటుంది.