హైపర్‌టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్.. ఇదొక తీవ్రమైన అనారోగ్య స్థితి. ప్రపంచవ్యాప్తంగా ఏటా అనేక మంది హైబీపీ కారణంగా చనిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావం మొదలై దాదాపుగా ఏడాదిన్నర దాటింది. ఈ క్రమంలోనే హైబీపీ సమస్య ఉన్నవారు కోవిడ్ కారణంగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
కాగా ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేసన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌పీఏఐ) నిపుణులు చెబుతున్న ప్రకారం.. మన దేశంలో కోవిడ్ సోకిన హైబీపీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా చనిపోతున్నారని వెల్లడించారు. ఇది సైలెంట్ కిల్లర్‌లా మారిందన్నారు. కోవిడ్ వల్ల గత ఏడాదిన్నర కాలం నుంచి చాలా మంది రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం లేదు. బీపీని కూడా ఎంత ఉందో చెక్ చేయించుకోవడం లేదు. దీంతో బీపీ ఎక్కువగా ఉంటోంది. అలాంటి వారు కోవిడ్ బారిన పడితే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.. అని నిపుణులు తెలియజేస్తున్నారు.
హైబీపీ సమస్య ఉన్నవారు మందులను ఎల్లప్పుడూ తీసుకుంటూనే ఉండాలి. అసలు మందులను మానరాదు. అలాగే బీపీని కొలిచే డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల వాటిని ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు ఇంట్లోనే బీపీని చెక్ చేసుకోవాలి. బీపీని నియంత్రణలో ఉంచుకునే పని చేయాలి. దీంతో కోవిడ్ సోకినా ప్రాణాపాయం ముప్పు తప్పుతుంది.. అని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 1.13 బిలియన్ల మంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల మరణాలు, అంగ వైకల్యం సంభవిస్తున్నాయి. కనుక హైబీపీ సమస్య ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా యుక్త వయస్సు ఉన్నవారు బీపీతో జాగ్రత్తగా ఉండాలి. బీపీని నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే హార్ట్ ఎటాక్ లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.. అని నిపుణులు అంటున్నారు.