Carom Seeds Water : మన వంటింట్లో ఉండే పదార్థాల్లో వాము కూడా ఒకటి. ఇది చక్కటి వాసనను కలిగి ఉంటుంది. ఎంతో కాలంగా వామును మనం వంటల్లో ఉపయోగిస్తున్నాం. వామును వాడడం వల్ల వంటల రుచి పెరగడంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వాము మన ఆరోగ్యానికి దివ్యౌషధంగా పని చేస్తుంది. వాము వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. వాములో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
వాములో ఉండే రసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎన్నో రకాల ఇన్ ఫెక్షన్ లు మన దరికి రాకుండా కాపాడతాయి. వాములో థైమల్ అనే రసాయనం బ్యాక్టీరియా, ఫంగల్ వ్యాధులను నిరోధిస్తుంది. అంతేకాకుండా వాము యాంటీ సెప్టిక్ గా కూడా పని చేస్తుంది. తలనొప్పి, అలసట, జలుబు, మైగ్రేన్ వంటి వాటికి వాము మందులా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలల్లో ఆకలిని పెంచి, గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వాము ఎంతగానో దోహదపడుతుంది. కడుపు నొప్పి నుండి వాము తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.
వామును గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకున్నా లేదా ఒక టీ స్పూన్ వామును అన్నంతో కలిపి తీసుకున్నా అజీర్తి తగ్గి ఆకలి పెరుగుతుంది. జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వాము నీటిని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. మూత్రాపిండాల్లో రాళ్లను కరిగించే శక్తి కూడా వాముకు ఉంది. వామును తేనెతో కలిపి పది రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగే అవకాశం ఉందట. నీళ్ల విరేచనాలను తగ్గించే గుణం కూడా వాముకు ఉంది. వాముతో చేసిన కషాయాన్ని తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి గాను ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి.
నీళ్లు వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ వామును వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. వేయించిన వామును, ఉప్పును కలిపి కచ్చా పచ్చగా దంచాలి. ఈ మిశ్రమాన్ని చిన్న పిల్లలకు రోజూ ఆహారంలో భాగంగా ఇవ్వడం అజీర్తి సమస్యలు తగ్గి ఆకలి పెరుగుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను కూడా వామును ఉపయోగించి నయం చేసుకోవచ్చు. నీటిలో వామును, శొంఠి పొడిని వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజుకు రెండు పూటలా పిల్లల చేత తాగించడం వల్ల పిల్లల్లో వచ్చే జీర్ణసంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి.
అదే విధంగా వాము పొడిని ఒక టీ స్పూన్ బెల్లంతో కలిపి తింటే చర్మం పై వచ్చే అలర్జీలన్నీ తొలగిపోతాయి. వామును నోట్లో ఉంచుకుని కొద్ది కొద్దిగా రసాన్ని మింగుతూ ఉంటే టాన్సిల్స్ వాపులు తగ్గుతాయి. రోజూ ఒక టీ స్పూన్ వామును నీటిలో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరాయిడ్స్ ఒక వారంలోనే తొలగిపోతాయి. ప్రతిరోజూ వామును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారు వాము నూనెను ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.
ఒకటి లేదా రెండు చుక్కల వాము నూనెను చెవిలో వేసుకోవడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది. ముక్కు దిబ్బడతో బాధపడుతున్నప్పుడు వామును ఒక వస్త్రంలో ఉంచి మూట కట్టి తరచూ వాసనను చూస్తూ ఉండడం వల్ల ముక్కు దిబ్బడ తగ్గుతుంది. ఈ విధంగా వాము మనకు ఎంతో సహాయపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గడంతోపాటు వాటి బారిన కూడా పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.