Jeelakarra Kashayam : మనలో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యలల్లో అధిక బరువు ఒకటి. అధిక బరువును తేలికగా అస్సలు తీసుకోరాదు. ఎందుకంటే అధిక బరువు అనేక రకాల ఇతరత్రా అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అధిక బరువు వల్ల హార్ట్ ఎటాక్, కీళ్ల నొప్పులు, హార్మోన్ ల అసమతుల్యత, ఆయాసం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా ఉన్న బరువును తగ్గించుకోవడానికి వ్యాయామం, యోగా, వాకింగ్ వంటి వాటిని చేయడంతోపాటుగా కచ్చితమైన ఆహార నియమాలను పాటించాలి. అప్పుడే అధిక బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే అధిక బరువు తగ్గడానికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గం ఉంది.
వంటల్లో ఉపయోగించే జీలకర్రను ఉపయోగించి మనం అధిక బరువును తగ్గించుకోవచ్చు. జీలకర్రను కషాయంగా చేసుకుని తాగడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరిగి నడుము నాజుకుగా తయారవుతుంది. జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల అధిక బరువు తగ్గడంతోపాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా మన దరి చేరకుండా ఉంటాయి. ఇక జీలకర్ర కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్ర కషాయాన్ని తయారు చేయడానికి ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని పోసి మరిగించాలి. ఇప్పుడు ఒక జార్ లో ఒక కప్పుకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చొప్పున రెండు కప్పుల నీటికి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని వేడి నీటిలో వేసి రెండు కప్పుల నీళ్లు ముప్పావు కప్పు అయ్యే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా త్వరగా కరుగుతుంది.
ఈ జీలకర్ర కషాయంలో తేనె, నిమ్మ రసాన్ని కూడా కలుపుకుని తాగవచ్చు. జీలకర్ర కషాయాన్ని తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు తగ్గుతాయి. గ్యాస్ , అజీర్తి వంటి సమస్యలు తగ్గి ఆకలి పెరుగుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు కూడా తొలగిపోతాయి. మూత్రాశయ సంబంధమైన ఇన్ ఫెక్షన్లతోపాటు శ్వాస సంబంధమైన సమస్యలు కూడా తగ్గుతాయి. జీలకర్రలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. కనుక ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో ఉండే నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.