పుదీనా.. అల్లం.. మన ఇండ్లలో ఉండే పదార్థాలే. కానీ వీటిని తక్కువగా ఉపయోగిస్తారు. నిజానికి వీటికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. పుదీనా మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచితే.. అల్లం అధిక బరువును తగ్గించడంతోపాటు జీర్ణ సమస్యలను పోగొడుతుంది. ఈ క్రమంలోనే రెండింటినీ కలిపి టీ ని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కప్పు నీటిలో 4-5 పుదీనా ఆకులు, 1 టీస్పూన్ తురిమిన అల్లం వేసి బాగా మరిగించాలి. సువాసన వచ్చే వరకు మరిగాక అందులో కొద్దిగా టీపొడి వేయాలి. తరువాత అర కప్పు పాలు పోయాలి. ఆ తరువాత మళ్లీ మరిగించాలి. అనంతరం టీ ని వడకట్టి వేడిగా ఉండగానే తాగేయాలి.
అయితే పాలను కలపకుండా కూడా ఈ టీని తయారు చేయవచ్చు. అవసరం అనుకుంటే అందులో 1 టీస్పూన్ తేనె కలిపి తాగవచ్చు. కానీ చక్కెర మాత్రం కలపకూడదు. ఇలా పుదీనా అల్లం టీని తయారు చేసుకుని రోజుకు 2 పూటలా తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు అధిక బరువు తగ్గుతారు.