Bisi Bele Bath : రోజూ సాధారణంగా చాలా మంది రకరకాల బ్రేక్‌ఫాస్ట్‌లను తింటుంటారు. ఇడ్లీ, దోశ, వడ.. ఇలా అనేక రకాలైన బ్రేక్‌ఫాస్ట్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కానీ కొన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు మనకు కేవలం హోటల్స్‌లో మాత్రమే లభిస్తాయి. అలాంటి వాటిలో బిసిబెలెబాత్ ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు శక్తిని, పోషకాలను అందిస్తుంది. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు. దీన్ని ఎలా తయారు చేయాలో.. అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బిసిబెలెబాత్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – అర కిలో, కందిపప్పు – ఒక కప్పు, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, మెంతులు -పావు టీ స్పూన్, ఎండు మిర్చి – 7, కరివేపాకు – ఒక రెబ్బ, లవంగాలు – 3, దాల్చిన చెక్క – 2 (చిన్నవి), పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన చింతపండు – కొద్దిగా, నీళ్లు – 8 కప్పులు.
కూరగాయల ముక్కలు..
ఆలుగడ్డ – 1, క్యారెట్ – 2, బెండకాయలు – 2, మునక్కాయ – 1, సొరకాయ – కొద్దిగా, టమాటాలు -2, బీన్స్ – 5, వంకాయలు – 2.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి -2, కరివేపాకు – ఒక రెబ్బ, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, ఇంగువ – పావు టీ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చి మిర్చి – 2.
బిసిబెలెబాత్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ధనియాలు, మినప పప్పు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, ఎండు మిర్చి, మెంతులు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చి కొబ్బరి వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని జార్ లో వేసి పొడిలా చేసుకోవాలి. తరువాత బియ్యాన్ని, కందిపప్పును బాగా కడిగి కుక్కర్ లో వేసుకోవాలి. ఈ కుక్కర్ లో నాలుగు కప్పుల నీళ్లను, పసుపును వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి గంటెతో అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక తాళింపు పదార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక కూరగాయ ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత చింతపండు రసం, 4 కప్పుల నీళ్లను పోసి మధ్యస్థ మంటపై కూరగాయ ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. కూరగాయ ముక్కలు ఉడికిన తరువాత ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత చిన్న మంటపై 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బిసిబెలెబాత్ తయారవుతుంది. ఇందులో వేయించిన జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే బిసిబెలెబాత్ ను తినడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.