Royyala Kura : సాధారణంగా చాలా మంది చికెన్, మటన్ లేదా చేపలు వంటి ఆహారాలను తింటుంటారు. కానీ పచ్చి రొయ్యలను తినేవారు చాలా తక్కువగా ఉంటారు. వాస్తవానికి మిగిలిన మాంసాహారాల కన్నా రొయ్యలు మనకు ఎంతో ఆరోగ్యవంతమైనవి అని చెప్పవచ్చు. ఇవి అందించే ప్రయోజనాలు అమోఘం. వీటిలో మన శరీరానికి కావల్సిన పోషకాలు అనేకం ఉంటాయి. ముఖ్యంగా మనలో చాలా మందికి విటమిన్ బి12 లోపం ఏర్పడుతుంటుంది. అలాంటి వారు వారంలో రెండు సార్లు రొయ్యలను తినాలి. దీంతో ఈ లోపం నుంచి బయట పడవచ్చు. ఇంకా ఎన్నో లాభాలు మనకు రొయ్యల వల్ల కలుగుతాయి. అయితే రొయ్యలను కూరగా ఎలా వండుకోవాలో చాలా మందికి తెలియదు. కనుక అలాంటి వారు కింద తెలిపిన విధంగా చేస్తే.. రొయ్యల కూర అద్భుతంగా వస్తుంది. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. పోషకాలు.. అన్నీ మనకు లభిస్తాయి. ఇక రొయ్యల కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రొయ్యల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి రొయ్యలు – 10 (మీడియం సైజ్ ఉన్నవి), బిర్యానీ ఆకులు – 2, యాలకులు – 2, లవంగాలు – 2, వాము – పావు టీస్పూన్, ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, కరివేపాకులు – 4, ధనియల పొడి – 1 టేబుల్ స్పూన్, కారం – 3 టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, పసుపు – పావు టీస్పూన్, గరం మసాలా పొడి – 1 టీస్పూన్, టమాటాలు – 2 (సన్నగా తరగాలి), నూనె – సరిపడా.
రొయ్యల కూర తయారు చేసే విధానం..
రొయ్యలను ఒలిచి ముందుగా బాగా శుభ్రం చేయాలి. తరువాత కిచెన్ టవల్‌లో చుట్టి వాటిని పొడిగా చేయాలి. ఒక పాన్ తీసుకుని నూనె వేసి కాగాక బిర్యానీ ఆకులు, యాలకులు లేదా యాలకుల గింజలు, లవంగాలు, వాము గింజలు వేసి బాగా వేయించాలి. సన్నని మంటపై వీటిని వేయించాక.. తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకులు వేసి మళ్లీ బాగా వేయించాలి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. పచ్చి వాసన పోయే వరకు వాటిని వేయించాలి. తరువాత ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి. తరువాత టమాటా ముక్కలను వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. టమాటా ముక్కలు మృదువుగా ఉడికే వరకు ఉడికించాలి. తరువాత నూనె బయటకు వస్తుంటుంది. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రొయ్యలను అందులో వేయాలి. బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తిరిగి మూత తీసి మరోమారు బాగా కలపాలి. అనంతరం మళ్లీ మూత పెట్టి మధ్యస్థ మంటపై ఉడికించాలి. కొంత సేపట్లోనే రొయ్యలు ఉడికిపోతాయి. చికెన్, మటన్ ఉడికేందుకు చాలా సమయం పడుతుంది. కానీ చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారాన్ని ఉడికించేందుకు చాలా తక్కువ సమయమే పడుతుంది. ఇక కూర బాగా ఉడికిన తరువాత దానిపై తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. దీంతో ఘుమ ఘుమలాడే రుచికరమైన రొయ్యల కూర రెడీ. దీన్ని అన్నం లేదా చపాతీలు, రోటీలు, పుల్కాల్లోనూ తినవచ్చు. దీంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. పోషకాలు లభిస్తాయి.