Black Chickpeas Curry : మనం వంటింట్లో ఉపయోగించే శనగలలో నల్ల శనగలు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శనగలల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారం తినని వారు శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినన్ని ప్రోటీన్స్ లభిస్తాయి. ఈ శనగలను మనం ఎక్కువగా గుగ్గిళ్ల రూపంలో తీసుకుంటూ ఉంటాం. కొందరు వీటితో కూరను కూడా తయారు చేస్తూ ఉంటారు. నల్ల శనగలతో చాలా సులువుగా కూరను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల శనగల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నల్ల శనగలు -ఒక కప్పు , పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – ఒకటి (పెద్దది), తరిగిన టమాటా – ఒరటి (పెద్దది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు – ఒకటి, జీలకర్ర – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, గరం మసాలా – పావు టీ స్పూన్, నీళ్లు – తగినన్ని.
నల్ల శనగల కూర తయారీ విధానం..
ముందుగా నల్ల శనగలను 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్లను పోసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ను వేసి తరిగిన ఉల్లిపాయను వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక తరిగిన టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టి టమాటాలు పూర్తిగా ఉడికే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లగా అయిన తరువాత జార్ లో వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత కళాయిలో టేబుల్ స్పూన్ నూనె వేసి కాగాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక కారం వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా మిశ్రమాన్ని వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
తరువాత ఉడక బెట్టిన శనగలు, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు నీళ్లను, రుచికి సరిపడా ఉప్పును వేసి కలిపి, మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర, గరం మసాలా ను వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నల్ల శనగల కూర తయారవుతుంది. ఇలా చేసుకున్న శనగల కూరను అన్నంతో పాటు లేదా చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. శనగలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. శనగలలో ప్రోటీన్స్, ఐరన్ అధికంగా ఉంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో శనగలు ఎంతో సహాయపడతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను నియంత్రించి, బరువు తగ్గడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. జుట్టు పెరుగుదలకు కూడా శనగలు దోహదపడతాయి. కనుక వీటిని తరచూ తింటే ఎంతో మేలు జరుగుతుంది.