Kobbari Pallila Laddu : మనం సాధారణంగా పల్లీలను, బెల్లాన్ని కలిపి పల్లి పట్టీలను, పల్లి లడ్డూలను (ఉండలను) తయారు చేస్తూ ఉంటాం. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి కావల్సిన పోషకాలను అందిస్తాయి. ఈ పల్లి లడ్డూలు, పల్లి పట్టీలను తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యానికి, ఎముకలు గట్టి పడడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అయితే ఈ పల్లీలకు మనం కొబ్బరిని జత చేసి మరింత రుచిగా ఉండే కొబ్బరి పల్లి లడ్డూలను తయారు చేసుకోవచ్చు. కొబ్బరి పల్లి లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి, వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పల్లీల లడ్డూల తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ముప్పావు కప్పు, పచ్చి కొబ్బరి తురుము – 2 కప్పులు, నువ్వులు – పావు కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు – పావు కప్పు, నెయ్యి – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – కొద్దిగా.
కొబ్బరి పల్లీల లడ్డూల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి చిన్న మంటపై బాగా వేయించుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నువ్వులను వేసి వేయించుకోవాలి. నువ్వులు చల్లారిన తరువాత ఒక జార్ తీసుకుని అందులో పక్కన పెట్టుకున్న పల్లీలను, నువ్వులను వేసి మరీ మెత్తగా కాకుండా పలుకులు ఉండేలా పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో బెల్లాన్ని వేసి నీళ్లను పోసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లాన్ని పాకం వచ్చే వరకు ఉడికించకూడదు. బెల్లం కరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కరిగించిన బెల్లాన్ని జల్లి గంట సహాయంతో వడకట్టుకుని పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో పచ్చి కొబ్బరి తురుమును, వడకట్టి పెట్టుకున్న బెల్లాన్ని, పలుకులుగా చేసి పెట్టుకున్న పల్లీలను వేసి బాగా కలుపుకోవాలి. మద్యస్థ మంటపై ఈ మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం ఉడికిన తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం నుండి కొద్దిగా తీసుకుని లడ్డూలలా చేసుకోవాలి. లడ్డూలు చేయడానికి వస్తే ఈ మిశ్రమం తయారయినదిగా భావించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడే మనకు కావల్సిన పరిమాణంలో లడ్డూలను చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పల్లి లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలలో పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరిని కూడా ఉపయోగించవచ్చు. ఈ లడ్డూలు 10 కోజుల వరకు నిల్వ ఉంటాయి. కొబ్బరి పల్లీల లడ్డూలను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇవి ఎంతో ఆరోగ్యకరమైనవి. ఇలా లడ్డూలను తయారు చేసుకుని రోజుకు ఒకటి తింటే అమితమైన శక్తి, పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.