Chilli : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిర్చిని ఉపయోగిస్తున్నారు. రోజువారి వంటకాల్లో కొందరు పచ్చి మిరపకాయలను వేస్తుంటారు. వీటిని పేస్ట్‌లా పట్టి ఉపయోగిస్తుంటారు. కొందరు ఈ కాయలను నేరుగా కోసి వంటల్లో వేస్తుంటారు. ఇక కూరలు కారంగా ఉండేందుకు కొందరు పచ్చి మిరపకాయలకు బదులుగా ఎండుకారం ఉపయోగిస్తుంటారు. అయితే పచ్చి మిరపకాయలు.. ఎండు కారం.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది ? దీని గురించి వైద్య నిపుణులు ఏమని చెబుతున్నారు ? అంటే..
పచ్చి మిరపకాయలను వాడినా లేదా కూరల్లో ఎండు కారం వేసినా.. దేన్ని వాడినా సరే.. అధిక మొత్తంలో కారం అనేది పనికి రాదు. అధికంగా కారం తింటే జీర్ణాశయం, పేగుల గోడలు వాపులకు గురవుతాయి. తరువాత అల్సర్ పుండ్లు వస్తాయి. దీంతో క్రమంగా జీర్ణవ్యవస్థ మొత్తం దెబ్బ తింటుంది. చివరకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక కారాన్ని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి.
ఇక పచ్చి మిరపకాయలు.. ఎండు కారం.. రెండింటిలో ఏది మంచిది ? అంటే.. స్వల్ప మోతాదులో తీసుకుంటే రెండూ మంచివే అని చెప్పవచ్చు. వీటి వల్ల మనకు భిన్న రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి మిరప కాయలను తీసుకుంటే వాటిల్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. ఇక ఎండు కారం అయితే క్యాప్సెయిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని వల్ల శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు. అలాగే ఎండు కారంలో విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది.
అయితే ఎండుకారం కన్నా పచ్చి మిరపకాయల వల్లే మనకు ప్రయోజనాలు అధికంగా లభిస్తాయి. పచ్చి మిరపకాయలను తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. చర్మం సురక్షితంగా ఉంటుంది. కాంతివంతంగా మారుతుంది. పచ్చి మిరపకాయల్లో ఉండే బీటా కెరోటిన్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక ఎండుకారంతో పోలిస్తే పచ్చి మిరపకాయల వల్లనే మనకు లాభాలు ఎక్కువగా ఉంటాయి. కనుక కూరల్లో పచ్చి మిరపకాయలను వాడితేనే మంచిది. అలాగని చెప్పి ఎండు కారం వాడొద్దని కాదు. కానీ మనకు లాభాలు మాత్రం పచ్చి మిరపకాయలతోనే ఎక్కువగా కలుగుతాయి.. కనుక వాటిని వాడడమే ఉత్తమమం అని చెప్పవచ్చు.