Munagaku Kura : మునగాకులలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం విదితమే. అందుకనే వాటిని తినాలని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. మునగాకులతో 300 రోగాలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదంలో ఉంది. కనుకనే దీనికి ఆయుర్వేదంలో అంతటి ప్రాధాన్యతను ఇచ్చారు. దీంతో అనేక రకాల ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తుంటారు. అయితే మునగాకులను రోజూ జ్యూస్‌గా తీసుకోవచ్చు. లేదా ఆకులను ఎండబెట్టి పొడి చేసి రోజూ ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. అయితే ఇలా నేరుగా వీటిని తినలేం.. అనుకునేవారు మునగాకులతో కూర తయారు చేసి కూడా తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడంతోపాటు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. కనుక మునగాకును కూరలా ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
మునగాకు – 4 కప్పులు, మినప పప్పు – పావు కప్పు, పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు, నూనె – ఒక టీస్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, తాళింపు కోసం నూనె – 2 టీస్పూన్లు, ఆవాలు – ఒక టీస్పూన్, ఎండు మిర్చి – 5, పసుపు – చిటికెడు.
మునగాకు కూర తయారు చేసే విధానం..
నూనెలో దోరగా వేయించిన మినప పప్పును కప్పు నీటిలో అరగంట పాటు నానబెట్టాలి. మునగాకును సన్నగా తరగాలి. కడాయిలో నూనె వేసి ఆవాలు, చిదిమిన ఎండు మిర్చి, పసుపు, మునగాకు తరుగు, వడకట్టిన మినప పప్పు, ఉప్పు.. ఒకదాని తరువాత మరొకటి వేయాలి. తర్వాత కొద్దిగా నీరు చిలకరించి ఆకులు మెత్తబడే వరకు మూత పెట్టి సన్నని మంటపై ఉడికించాలి. దించే ముందు కొబ్బరి తురుము చల్లాలి. ఈ కూరను అన్నం లేదా చపాతీలు.. దేంతో తిన్నా.. చాలా రుచిగా ఉంటుంది.