Keera Dosa Juice : కీరదోసలను సహజంగానే చాలా మంది ఈ సీజన్‌లో ఎక్కువగా తింటుంటారు. వీటిని తినడం వల్ల శరీరంలో ఉండే వేడి మొత్తం తగ్గిపోతుంది. శరీరం చల్లబడుతుంది. అలాగే వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది. కనుక కీరదోసను ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకోవాలి. అయితే దీన్ని నేరుగా తినలేమని అనుకునేవారు ఎంతో రుచికరంగా జ్యూస్ ను తయారు చేసి కూడా తాగవచ్చు. దీన్ని తాగినా కూడా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలే లభిస్తాయి. ఇక కీరదోస జ్యూస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కీర దోస జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
కీర దోస కాయ – 1 (మధ్యస్థంగా ఉన్నది), అల్లం ముక్కలు – ఒక టీస్పూన్, పుదీనా ఆకులు – 15 నుండి 20, తేనె – ఒక టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ – తగినన్ని, నీళ్లు – అర గ్లాసు, నిమ్మ కాయ రసం – ఒక టీ స్పూన్.
కీర దోస జ్యూస్ తయారీ విధానం..
ముందుగా కీర దోసను శుభ్రంగా కడిగి పొట్టుతో సహా ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఒక జార్ లో లేదా బ్లెండర్ లో కీర దోస ముక్కలను వేసి నీళ్లను తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో నీళ్లను పోసి జల్లి గంట సహాయంతో వడకట్టుకోవాలి. ఇలా చేయగా వచ్చిన జ్యూస్ లో చిటికెడు మిరియాల పొడి వేసి కలపాలి. దీంతో కీరదోస జ్యూస్ తయారవుతుంది. దీన్ని తాగితే ఎంతో రుచిగా, చల్లగా ఉంటుంది. ఈ జ్యూస్ తయారీలో తేనెకు బదులుగా పంచదారను కూడా ఉపయోగించవచ్చు. ఈ జ్యూస్ ను మసాలా ప్లేవర్ లో కూడా తయారు చేసుకోవచ్చు. మిక్సీ పట్టేటప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ చాట్ మసాలాను వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా కీర దోస జ్యూస్ తయారవుతుంది. ఇలా కీర దోసతో జ్యూస్‌లను తయారు చేసుకుని తాగడం వల్ల వేసవి వేడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇంకా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి.