Palli Chikki : మనం సాధారణంగా వేరు శనగ పపప్పులను (పల్లీలను), బెల్లాన్ని కలిపి తింటూ ఉంటాం. వీటిని కలిపి తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఎముకలు, దంతాలు ధృడంగా తయారవుతాయి. నెలసరి సమయంలో పల్లీలను, బెల్లాన్ని కలిపి తినడం వల్ల వెన్ను నొప్పి తగ్గడమే కాకుండా గర్భాశయ పని తీరు మెరుగుపడుతుంది. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో హిమో గ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనత సమస్యతో బాధ పడే వారు వీటిని కలిపి తినడం వల్ల ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
మనం పల్లీలను, బెల్లాన్ని కలిపి తినడమే కాకుండా పల్లి పట్టీ, పల్లి లడ్డూలను తయారు చేస్తూ ఉంటాం. కొందరికి ఎంత ప్రయత్నించినా పల్లి పట్టీలను తయారు చేయడం రాదు. పల్లి పట్టీ మరీ మెత్తగా అవ్వడమో లేదా గట్టిగా అవ్వడమో జరుగుతుంది. పల్లి పట్టీ చక్కగా వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి పట్టీ (పల్లి చిక్కి) తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 కప్పులు (అర కిలో), బెల్లం తురుము – 2 కప్పులు (400 గ్రా.), నీళ్లు – కొద్దిగా, యాలకుల పొడి – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టీ స్పూన్.
పల్లి పట్టీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీల పొట్టు తీయడమే కాకుండా ఒక పల్లి గింజ రెండు పలుకులు అయ్యే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లం చొప్పున రెండు కప్పుల పల్లీలకు రెండు కప్పుల బెల్లాన్ని ఒక కళాయిలో వేసుకోవాలి. ఈ బెల్లంలో కొద్దిగా నీటిని పోసి మధ్యస్థ మంటపై బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం కరిగిన తరువాత ఈ నీటిని జల్లి గంట సహాయంతో వడబోసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. ఇలా వడపోసిన బెల్లం నీటిని మళ్లీ కళాయిలో పోసుకుని మధ్యస్థ మంటపై ముదురు పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి.
ఒక ప్లేట్ లో కొద్దిగా నీటిని తీసుకుని అందులో ఉడికించిన బెల్లం పాకాన్ని వేసి ముద్దలా చేసుకోవాలి. చేతికి అంటుకోకుండా ముద్దగా చేయడానికి వస్తే బెల్లం ముదురు పాకం వచ్చిందిగా భావించాలి. బెల్లం పాకం ముద్దగా చేయడానికి రాకపోతే మరి కొద్ది సేపు ఉడికించుకోవాలి. బెల్లం ముదురు పాకం వచ్చిన తరువాత యాలకుల పొడి, నెయ్యి వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకంలో ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పల్లి, బెల్లం మిశ్రమాన్ని ఒక ప్లేట్ కి నెయ్యిని రాసి అందులోకి తీసుకోవాలి.
చేత్తో కానీ, గిన్నె సహాయంతో కానీ వీలైనంత పలుచగా చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా గట్టి పడిన తరువాత కత్తి సహాయంతో కావల్సిన పరిమాణంలో గాట్లు పెట్టుకోవాలి. ఈ మిశ్రమం పూర్తిగా గట్టిపడిన తరువాత ప్లేటు నుండి వేరు చేసుకోవాలి. ఒకవేళ ఈ మిశ్రమం ప్లేటుకి అతుక్కుపోయి రాకపోతే ఈ ప్లేట్ ని స్టవ్ మీద పెట్టి 3 సెకన్ల పాటు వేడి చేసుకోవాలి. దీంతో సులువుగా ఈ మిశ్రమం ప్లేట్ నుండి సులువుగా వేరవుతుంది.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి పట్టీలు తయారవుతాయి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంతో పల్లి లడ్డూలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పల్లి పట్టీలను గాలి తగలని డబ్బాలో వేసుకుని నిల్వ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజుల పాటు ఉన్నా పాడవకుండా ఉంటాయి. వీటిని రోజుకి ఒకటి తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరానికి శక్తి లభించడంతోపాటు రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. అలాగే అనేక పోషకాలు లభిస్తాయి.