Flax Seeds Laddu : హైబీపీని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అవిసె గింజలు ఎంతగానో సహాయపడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లను అత్యధికంగా కలిగి ఉన్న వాటిల్లో అవిసె గింజలు ఒకటి. అవిసె గింజలను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువును తగ్గించడంలోనూ ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అజీర్తి సమస్యను తగ్గించడంలో ఈ గింజలు దోహదపడతాయి. అవిసె గింజలతో మనం లడ్డూలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. మనకు పోషకాలను, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇక అవిసె గింజలతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజల లడ్డూలు తయారీకి కావల్సిన పదార్థాలు..
అవిసె గింజలు – ఒక కప్పు, పల్లీలు- అర కప్పు, నువ్వులు – అర కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, యాలకుల పొడి – కొద్దిగా, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – పావు కప్పు.
అవిసె గింజల లడ్డూలు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో అవిసె గింజలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత పల్లీలను, నువ్వులను ఒక్కొక్కటిగా వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత ఒక జార్ లో ముందుగా అవిసె గింజలను వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత నువ్వులను, పల్లీలను వేసి పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా పట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో బెల్లం తురుము, నీళ్లను పోసి మధ్యస్థ మంటపై బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత జల్లిగంటె సహాయంతో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ కళాయిలో వేసి లేత తీగ పాకం వచ్చే వరకు మధ్యస్థ మంటపై ఉడికించుకోవాలి.
బెల్లం తీగ పాకం వచ్చిన తరువాత నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న అవిసె గింజలు, పల్లీలు, నువ్వుల పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమం గోరు వెచ్చగా ఉన్నప్పుడే కావలసిన పరిమాణంలో లడ్డూలలా చేసుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే అవిసె గింజల లడ్డూలు తయారవుతాయి. వీటిలో పల్లీలు, నువ్వులకు బదులుగా డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకోవచ్చు. ఈ లడ్డూలను రోజుకి ఒకటి లేదా రెండింటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అనేక పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా శరీరానికి శక్తి అందుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. దీంతో బరువు తగ్గుతారు.