జొన్నలు అద్భుతమైన ఆహారం. చిరుధాన్యాల్లో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని పిండిగా చేసి ఆ పిండితో రొట్టెలు తయారు చేసుకుని తినడం చాలా మందికి అలవాటు. అయితే జొన్న రొట్టెలను కింద తెలిపిన విధంగా చేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటాయి. సాధారణంగా కేవలం ఒక్క పిండిని మాత్రమే వేసి జొన్న రొట్టెలను తయారు చేస్తే కొందరికి తినేందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారు కింద ఇచ్చిన విధంగా ఆ రొట్టెలను తయారు చేసుకుని తింటే దాంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలు లభిస్తాయి. మరి జొన్న రొట్టెలను రుచికరంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
* జొన్న పిండి – 3 కప్పులు
* గోధుమ పిండి – 1 కప్పు
* జీలకర్ర – అర టీస్పూన్
* నువ్వులు – అర టీస్పూన్
* ఉల్లిపాయ – 1 (పెద్దది, సన్నగా తరగాలి)
* పచ్చి మిరపకాయలు – 2 (బాగా తరగాలి)
* కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగింది)
* ఉప్పు – రుచికి సరిపడా
* నూనె లేదా నెయ్యి – సరిపడా
* వేడి నీళ్లు – తగినన్ని
* అన్ని పదార్థాలను ఒక పాత్రలో వేసి అందులో వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. పిండి మృదువుగా అయ్యే వరకు కలుపుకోవాలి. అనంతరం పిండిపై నూనె చల్లి దాన్ని 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
* పిండిని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేయాలి.
* ఒక్కో పిండి ముద్దను తీసుకుని పీట లేదా కిచెన్ బండపై ఉంచి చేతులను తడి చేసుకుని ఆ పిండి ముద్దను ఒత్తుతూ పెద్దదిగా చేయాలి. రోటీ మాదిరిగా తయారు చేసుకోవాలి.
* తయారు చేసుకున్న రొట్టెలను నాన్ స్టిక్ పాన్‌పై వేసి కాల్చాలి. సన్నని మంట మీద రొట్టెలను కాల్చాల్సి ఉంటుంది. రొట్టెలు బాగా కాలేంత వరకు రెండు వైపులా కాల్చాలి. మధ్య మధ్యలో రొట్టెపై రెండు వైపులా నెయ్యి లేదా నూనె వేస్తూ రొట్టెను గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు కాల్చాలి.
ఇలా కాల్చిన జొన్న రొట్టెలు ఎంతో రుచికరంగా ఉంటాయి. వాటిని నేరుగా తినవచ్చు. లేదా పప్పు, కూరలు వంటి వాటితో కలిపి తినవచ్చు. తోడుగా పచ్చి ఉల్లిపాయలను కూడా పెట్టుకుని తినవచ్చు. జొన్న రొట్టెలను ఇలా తయారు చేయడం వల్ల ఎవరైనా సరే వాటిని ఇష్టంగా తింటారు. దీంతోపాటు పోషకాలు, శక్తి కూడా అందుతాయి.