Puliyabettina Ragi Ambali : మనం చిరు ధాన్యాలైన రాగులను కూడా అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. రాగులను పిండిగా చేసి ఆ పిండితో మనం జావను, రొట్టెను, ఉప్మాను చేసుకుని తింటూ ఉంటాం. రాగి పిండితో ఇవే కాకుండా అంబలిని కూడా తయారు చేస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఇలా రాగి అంబలిని చేసుకుని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. దీనిని తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.
రాగి అంబలిని తాగడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. రాగి అంబలిని తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. రక్త హీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. తద్వారా బరువు తగ్గుతారు. చాలా సులువుగా మనం రాగి అంబలిని తయారు చేసుకోవచ్చు. శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ రాగి అంబలిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి అంబలి తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగి పిండి – 5 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – ఒకటి (పెద్దది), తరిగిన పచ్చి మిర్చి – 4, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, పెరుగు – ఒక కప్పు, నీళ్లు – ముప్పావు లీటర్, ఉప్పు – తగినంత.
రాగి అంబలి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని అందులో ఒక కప్పు నీళ్లను పోసి ఉండలు లేకుండా కలిపి మూత పెట్టి ఒక రోజంతా పులియబెట్టాలి. మరుసటి రోజు పులియ బెట్టిన రాగి పిండిని తీసుకుని మరోసారి బాగా కలపాలి. తరువాత పెరుగును కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నెను తీసుకుని అందులో నీళ్లను పోసి రుచికి తగినంత ఉప్పును, తరిగిన పచ్చి మిర్చిని వేసి నీళ్లను బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తరువాత ముందుగా పులియ బెట్టుకున్న రాగి పిండిని వేసి కలిపి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి రాగి పిండి మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన ఉంచాలి.
ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత తరిగిన ఉల్లిపాయలను, పుదీనాను, కొత్తిమీరను, పెరుగును వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి అంబలి తయారవుతుంది. దీనిని ఉల్లిపాయ, పచ్చి మిర్చి తో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా శరీరానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వేసవి కాలంలో ఇలా రాగి అంబలిని తాగడం వల్ల ఎండ వల్ల కలిగే నీరసం తగ్గి శరీరానికి శక్తి లభిస్తుంది. శరీరంలో ఉండే వేడి తగ్గి చలువ చేస్తుంది.