Ragi Roti : మనకు విరివిరిగా లభించే చిరు ధాన్యాలలో రాగులు ఒకటి. రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. బరువును తగ్గించడంలో రాగులు ఎంతో సహాయపడతాయి. హైబీపీని, షుగర్ ను తగ్గిస్తాయి. వేసవి కాలంలో రాగి జావను తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. రక్త హీనతను తగ్గిస్తుంది. ఎముకలను దృఢంగా చేయడంలో రాగులు ఉపయోగపడతాయి. అజీర్తి సమస్యను తగ్గిస్తాయి.
రాగులను ఆహారంలో భాగంగా చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. మనం ఎక్కువగా రాగులతో జావ, ఉప్మా, ఇడ్లీ, దోశలను తయారు చేస్తూ ఉంటాం. రాగులతో ఎంతో రుచికరంగా ఉండే రోటీలను కూడా తయారు చేసుకోవచ్చు. రాగి రోటీలను ఎలా తయారు చేసుకోవాలి, వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి రోటీ తయారీ విధానం..
రాగి పిండి – ఒక కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, సన్నగా తరిగిన పచ్చి మిర్చి ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, గోరు వెచ్చని నీళ్లు – తగినన్ని.
రాగి రోటీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో రాగి పిండిని వేసి 3 నుండి 4 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న రాగి పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి కాగాక పసుపు, ఉప్పు, నీళ్లు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా వేయించుకోకూడదు. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని రాగి పిండిలో కలుపుకోవాలి. రాగి పిండిలో ఈ మిశ్రమంతోపాటు పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా ఉండేలా ఈ పిండిని కలుపుకోవాలి.
ఈ పిండిని కలిపిన తరువాత చేతిలోకి కొద్దిగా నూనెను తీసుకుని.. కలిపిన పిండిని ముద్దగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్, అరటి ఆకు లేదా ప్లాస్టిక్ షీట్స్ ను తీసుకుని వాటిపై కొద్దిగా నూనె రాసి, కావలసిన పరిమాణంలో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని చేత్తో నొక్కుతూ రోటీలా చేసుకోవాలి. రోటీ చేసేటప్పుడు చేతికి పిండి అంటుకు పోకుండా నూనెను కానీ నీటిని కానీ ఉపయోగించవచ్చు.
ఇలా చేసిన రోటీని పెనంపై వేసి నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి రోటీ తయారవుతుంది. ఈ రోటీలో కొత్తిమీరకు బదులుగా మెంతి కూర, పాల కూర, తోట కూరను కూడా ఉపయోగించవచ్చు. ఇలా తయారు చేసుకున్న రాగి రోటీలను ఉల్లిపాయను తింటూ నేరుగా తినవచ్చు లేదా టమాటా చట్నీ, కొబ్బరి చట్నీతో కలిపి తినవచ్చు. దీంతో రాగి రోటీలు ఎంతో రుచిగా ఉంటాయి. పైగా వీటిని తింటే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు కూడా..!