Puffed Rice : ప్రస్తుత కాలంలో అధిక బరువు, ఊబకాయం, భారీ ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. ఇలాంటి వారిలో ఎటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల బరువు పెరుగుతారు, తగ్గుతారు అనే సందేహాలు వస్తుంటాయి. ఇలాంటి వారు బరువును తగ్గించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బరువును తగ్గించే ముఖ్యమైన ఆహార పదార్థాలలో మరమరాలు (పఫుడ్ రైస్ లేదా బొరుగులు) ఒకటి.
మరమరాలు అందరికీ తెలిసినవే. వీటితో మనం రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. మరమరాలను మనం ఎక్కువగా స్నాక్స్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. వీటిని బియ్యం నుండి తయారు చేస్తారు. బరువు తగ్గాలనుకునే వారు అన్నాన్ని ఎక్కువగా తినరు. కానీ బియ్యంతో తయారు చేసిన మరమరాలను తినవచ్చు. నానబెట్టిన బియ్యాన్ని వేయించడం వల్ల అవి పొంగి చాలా తేలికగా ఉండే మరమరాలుగా తయారవుతాయి. వీటిని తయారు చేయడంలో ఉప్పును చాలా తక్కువ మోతాదులో వాడుతూ ఉంటారు.
రెండు పుల్కాలను తయారు చేయడానికి మనకు 50 గ్రా. ల పిండి అవసరమవుతుంది. మనం 50 గ్రా. ల మరమరాలను తీసుకున్నప్పుడు ఇవి తేలికగా ఉన్న కారణంగా ఎక్కువ పరిమాణంలో వస్తాయి. అధిక బరువు, ఊబకాయంతో బాధపడే వారు ఆహార నియమాలను పెట్టుకుని ఎంతో క్రమ శిక్షణతో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వారు రాత్రి భోజనంలో భాగంగా వారానికి ఒకసారి మరమరాలతో చాట్ ను తయారు చేసుకుని తినవచ్చు.
ఉల్లిపాయ ముక్కలకు, పచ్చి మిర్చి ముక్కలకు కొద్దిగా నిమ్మరసం, ఎండు కారాన్ని కలిపి ఉంచుకోవాలి. టమాట ముక్కలను, వేయించిన పల్లీలు, పుట్నాలను సిద్దంగా ఉంచుకోవాలి. ఒక గిన్నెలో మరమరాలను తీసుకుని అందులో ముందుగా సిద్దం చేసుకున్న వాటన్నింటినీ వేసి బాగా కలిపి రాత్రి భోజనంలో భాగంగా తినవచ్చు. 50 గ్రా. ల మరమరాలు చూడడానికి ఎక్కువ పరిమాణంలో ఉన్నా వీటిలో క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. మరమరాలతో ఉప్మా (ఉగ్గాణి) నిను కూడా తయారు చేసుకుని తినవచ్చు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉన్నందున ఆహార నియమాలు పెట్టుకుని బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చని అంటున్నారు.