Biyyam Java : ప్రస్తుత వర్షాకాలంలో జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఎక్కువగా ఉంటున్నారు. ఈ సమస్యల బారిన పడినప్పుడు ఏమీ తినాలనిపించదు. నాలుక కూడా చాలా చేదుగా ఉంటుంది. అలాంటి సమయంలో మనం ఏదో ఒక ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే మరింత నీరసపడే అవకాశం ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారం కూడా త్వరగా జీర్ణమయ్యేలా ఉండాలి. కనుక జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు బియ్యంతో జావను తయారు చేసుకుని తినడం వల్ల త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా శరీరానికి తగినంత శక్తిని కూడా ఇస్తుంది. ఈ జావను రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం జావ తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – అర టీ గ్లాస్, నీళ్లు – 4 టీ గ్లాసులు, ఉప్పు- తగినంత.
బియ్యం జావ తయారీ విధానం..
ముందుగా కళాయిలో బియ్యాన్ని వేసి చిన్న మంటపై కలుపుతూ రంగు మారే వరకు వేయించాలి. తరువాత ఈ బియ్యాన్ని చల్లగా అయ్యే వరకు ఉంచి ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత బియ్యాన్ని గోధుమ రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లను పోయాలి. తరువాత రవ్వను వేసి కలుపుతూ 15 నుండి 20 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. బియ్యం రవ్వ మెత్తగా ఉడికిన తరువాత ఉప్పును వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బియ్యం జావ తయారవుతుంది. దీనిని ఏదైనా పచ్చడితో కానీ లేదా మజ్జిగను కలుపుకుని తీసుకోవచ్చు. జ్వరం, దగ్గు, జలుబు లేదా ఏదైనా జబ్బు చేసినప్పుడు ఇలా నోటికి రుచిగా అలాగే త్వరగా జీర్ణమయ్యేలా బియ్యం జావను తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించి నీరసం తగ్గుతుంది.