Ginger Pickle : మన వంటింట్లో తప్పకుండా ఉండాల్సిన వాటిల్లో అల్లం కూడా ఒకటి. అల్లంలో ఉండే ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యల బారి నుండి కాపాడడంలో అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వంటల్లో ఉపయోగించడమే కాకుండా అల్లంతో ఎంతో రుచిగా ఉండే నిల్వ పచ్చడిని కూడా తయారుచేసుకోవచ్చు. అల్లంతో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – 150 గ్రా., ఎండు మిరపకాయలు – 8 లేదా తగినన్ని, ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్, నీళ్లు – 200 ఎంఎల్, చింతపండు – 100 గ్రా., నూనె – 100 ఎంఎల్, ఆవాలు – ఒకటీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండు మిర్చి – 2, కరివేపాకు – రెండు రెబ్బలు, ఇంగువ – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, బెల్లం తురుము – 100 గ్రా., ఉప్పు – 3 టీ స్పూన్స్ లేదా తగినంత.
అల్లం నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా అల్లాన్ని శుభ్రం చేసి ముక్కలుగా కోసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లను పోసి నీళ్లు కాగిన తరువాత శుభ్రం చేసుకున్న చింతపండును వేసి మెత్తగా అయ్యి దగ్గరపడే వరకు ఉడికించి చల్లగా అయ్యే వరకు పక్కకు ఉంచాలి. తరువాత ఒక కళాయిలో ఎండు మిరపకాయలను వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ధనియాలను వేసి చిన్న మంటపై ఎక్కువ సేపు వేయించుకోవాలి. తరువాత మెంతులను కూడా వేసి వేయించి చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. వీటిని మెత్తగా పొడిలా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తరువాత అల్లం ముక్కలను వేసి వేయించుకోవాలి.
అల్లం ముక్కలు బాగా వేగిన తరువాత వాటిని ఒక జార్ లోకి తీసుకుని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే ఉడికించిన చింతపండును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మిగిలిన నూనె పోసి నూనె కాగిన తరువాత ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత ఇంగువను, పసుపును వేసి కలపాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
తరువాత బెల్లం తురుమును అలాగే ఒక టేబుల్ స్పూన్ నీళ్లను వేసి బెల్లం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తరువాత తగినంత ఉప్పును వేసి కలపాలి. తరువాత పచ్చడి నుండి నూనె బయటకు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా అలాగే ఆరోగ్యానికి మేలు చేసే అల్లం నిల్వ పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తరువాత ఒక గాజు సీసాలో గాలి తగలకుండా నిల్వ చేసుకోవడంవల్ల ఆరు నెలల పాటు తాజాగా ఉంటుంది. దీనిని అన్నంతోపాటు అల్పాహారాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. అల్లంతో ఈ విధంగా పచ్చడిని చేసుకుని తినడం వల్ల కూడా అల్లం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.