Liquorice : ఆయుర్వేదంలో అనేక మూలికలకు ఎంతో ప్రాధాన్యత కల్పించారు. వాటి ద్వారా మనం ఎన్నో వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే కొన్ని మూలికల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిల్లో అతి మధురం ఒకటి. ఇది చూర్ణం రూపంలో మనకు లభిస్తుంది. దీని వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అతి మధురం చూర్ణం వేసి కొంత సేపు మరిగించాలి. అనంతరం ఆ నీటిని నెమ్మదిగా కొద్ది కొద్దిగా తాగాలి. దీంతో గొంతు నొప్పి, మంట, దురద వంటి గొంతు సమస్యలు తగ్గుతాయి.
2. మరిగించిన నీటిలో అతిమధురం చూర్ణం వేసి కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని రాస్తుంటే చర్మంపై దద్దుర్లు, దురదలు, ఇతర చర్మ సమస్యలు తగ్గిపోతాయి.
3. ఒక కప్పు నీటిలో కొద్దిగా అతి మధురం చూర్ణం, దాల్చిన చెక్క పొడి వేసి మరిగించాలి. అనంతరం అందులో అల్లం రసం వేసి తాగాలి. దీంతో దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి.
4. అతి మధురం చూర్ణం, దాల్చిన చెక్క పొడి, తేనెలను సమాన భాగాల్లో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. దీంతో కళ్ల నొప్పి, తలనొప్పి తగ్గుతాయి.
5. మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో మంటగా అనిపిస్తుంటే.. ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా అతి మధురం చూర్ణం, యాలకుల పొడి, తేనెలను వేసి కలిపి తాగాలి.
6. నువ్వుల నూనెను తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. ఇందులో అతి మధురం చూర్ణాన్ని కొద్దిగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని తలకు బాగా రాయాలి. ఒక గంట సేపు అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.
7. అతి మధురం చూర్ణం, రోజ్ వాటర్, తేనెలను తీసుకుని కలిపి ఫేస్ ప్యాక్‌లా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని గంట సేపు అయ్యాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు, మచ్చలు పోతాయి.
8. అతి మధురం చూర్ణంలో నీరు కలిపి పేస్ట్‌లా చేసి దాన్ని నోట్లో పుండ్లపై రాయాలి. అవి తగ్గిపోతాయి.
9. అతి మధురం చూర్ణంలో నీటిని కలిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు, దెబ్బలు, పుండ్లపై రాయాలి. రోజూ ఇలా చేస్తుంటే అవి త్వరగా మానిపోతాయి.
10. అతి మధురం చూర్ణంలో వేడి చేసిన నువ్వుల నూనెను కొద్దిగా కలిపి ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట రాయాలి. దీంతో కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.