Black Pepper : ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. చాలా కాలం నుండి మనం వంటల్లో మిరియాలను ఉపయోగిస్తున్నాం. మిరియాలలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతోపాటు ఔషధ గుణాలు కూడా ఉంటాయి. మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో మిరియాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయుర్వేదంలో కూడా మిరియాలను అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంగా చాలా కాలం నుండి ఉపయోగిస్తున్నారు. వీటి గొప్పతనం తెలుసుకున్న మన పూర్వీకులు మిరియాలను మన వంటల్లో భాగం చేశారు. మిరియాలను క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తారు. మిరియాలను ఉపయోగించడం వల్ల వంటల రుచి, వాసన పెరుగుతాయి.
వీటిల్లో కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం వంటి మినరల్స్ తోపాటు విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. మనకు వచ్చే అనేక రకాల రుగ్మతలను మిరియాలను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. జలుబుతో బాధపడే వారు మరిగించిన నీటిలో మిరియాల పొడిని వేసి ఆవిరి పడితే జలుబు తగ్గుతుంది. గొంతునొప్పి, తలనొప్పి, జలుబు వంటి బారిన పడినప్పుడు పాలలో మిరియాల పొడిని కలుపుకుని తాగడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మిరియాల పొడిని, శొంఠి పొడిని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి. చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలతో బాధపడే వారు రాళ్ల ఉప్పును, మిరియాల పొడిని కలిపి చిగుళ్లకు పట్టించాలి. తరువాత వేడి నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల సమస్య తగ్గి చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
అధిక బరువు ఉన్న వారు భోజనానికి అరగంట ముందు మిరియాల పొడిని, తేనెను కలిపి తీసుకోవాలి. తరువాత వేడి నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. బాదంపప్పుతో మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మిరియాల పొడికి ఉప్పును కలిపి దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాల సమస్యలు తొలగిపోవడమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. మిరియాలలో యాంటీ సెప్టిక్ లక్షణాలు కూడా ఉంటాయి. గాయాలు తగిలినప్పుడు మిరియాల పొడిని నెయ్యితో కలిపి లేపనంగా రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.
మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేయాలి. ఈ పొడిని శరీరంలో నొప్పులు , వాపులు ఉన్న చోట రాయడం వల్ల వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. పసుపును, మిరియాల పొడిని కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మొటిమలు తగ్గు ముఖం పడతాయి. పొట్టలో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాస్ మజ్జిగలో పావు టీ స్పూన్ మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మంట, శరీరంలో అధిక వేడి ఉన్న వారు మిరియాలను తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా మిరియాలను ఉపయోగించడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడవచ్చని.. ప్రస్తుత వర్షాకాలంలో వీటిని తప్పకుండా ఉపయోగించాలని.. నిపుణులు తెలియజేస్తున్నారు.