ఆయుర్వేద ప్రకారం వాత, పిత్త, కఫ దోషాల్లో ఏర్పడే అసమతుల్యతల వల్లే ఏ అనారోగ్య సమస్యలు అయినా వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు గాను త్రిఫల చూర్ణం వాడమని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఇది త్రిదోషాలను సమం చేస్తుంది. దీంతో అన్ని రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అయితే ఆ త్రిఫల చూర్ణంలో వాడే ఒక పదార్థమే తానికాయ. ఇది కఫ దోష వ్యాధులకు బాగా పనిచేస్తుంది.
తానికాయలను అతిగా తీసుకుంటే వేడి చేస్తుంది. ఇవి జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మూత్ర మండల వ్యవస్థకు చెందిన రోగాలను నయం చేస్తాయి. తానికాయ ఆరోగ్య ప్రదాయిని. వీటిని అచ్చ తెలుగులో వాక కాయలుగానూ పిలుస్తుంటారు. తెర్మినలియా బెల్లిరికా శాస్త్రీయ నామం కలిగిన ఈ వృక్ష సంతతి ఆయుర్వేద వైద్యంలోనే కాదు వంటింటి చిట్కా వైద్యాలలోనూ తనదైన ఫలితాలను అందిస్తుంది.
ఈ కాయలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చాలా ప్రాంతాలలో లభిస్తాయి. బాదం చెట్టును పోలి ఉండి అదే తరహా ఆకులతో ఆకుపచ్చ ఛాయ కలిగి లేత పసుపు రంగున్న పుష్పాలు, నక్షత్ర ఆకారపు చిన్నపాటి కంకులని కలిగి ఉంటాయి. చిన్న సైజులో ఆకుపచ్చ ద్రాక్షపళ్లను పోలి ఉండే ఈ తాని కాయలు గుండ్రంగా ఉండి కాస్త ఫలాలుగా మారాక ఉసిరి కాయ సైజులో మట్టిరంగులో కనిపిస్తాయి.
ఉప్పు మినహా దాదాపు అన్ని రకాల రుచుల్ని కలిగి ఉన్న ఈ తానికాయలు శ్వాస సంబంధిత వ్యాధులకు, జీర్ణ వ్యవస్ధలో వచ్చే రుగ్మతలను నివారించేందుకు ఉపయోగపడుతాయి. ఇక మూత్ర వ్యవస్థను శుభ్రపరిచేందుకు కూడా వీటిని ఆయుర్వేద వైద్యులు ఉపయోగిస్తారు. లివర్‌కి సంబంధించిన టానిక్‌ల తయారీలోనూ, అజీర్ణానికి చెందిన మందుల తయారీలోనూ, దగ్గు, కఫం, క్షయ, ఆస్తమా, ఎలర్జీల నివారణ కోసం తానికాయ మంచి మందుగా పనిచేస్తుంది.
డయేరియా, డీసెంట్రీ, చిన్న పేగుల వాపు తదితర వ్యాధులు తగ్గటానికి, ఉదర వ్యాధులను తగ్గించేందుకు, కేశ సంపదని పెంపొందించేందుకు, జుట్టు నల్ల బడేందుకు, కంటి చూపుకు సంబంధించిన వ్యాధుల నివారణకు ఈ కాయలు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. తానికాయలలో వేడి చేసే గుణం ఉంది. మూల శంకను నివారించేందుకు, అతిసారాన్ని అరికట్టేందుకు వాడుతారు. ఇక త్రిఫల కషాయంగా దీన్ని తీసుకుంటే శూలాలను తగ్గించడమే కాకుండా మెదడు చురుకుగా పని చేసేందుకు ఉపయోగ పడుతుంది.
తానికాయల కషాయానికి అశ్వగంధ చూర్ణాన్ని, బెల్లంతో కలిపి సేవిస్తే వాతం తగ్గుతుంది. దీనిలో ఎలాజిక్ యాసిడ్, గ్లూకోజ్, షుగర్, మైనిటాల్, గ్లాక్టోజ్, ఫ్రక్టోజ్, రమ్‌నోస్, ఫాటియాసిడ్లు, గాలిక్ యాసిడ్, బెటాసిటోస్టిరాల్ తదితర వైద్యలక్షణాలు కలిగిన మందులు చాలా ఉన్నాయి.
తాని కాయల గింజలు కూడా వైద్య పరంగా మంచి ఫలితాలను ఇస్తాయి. వీటిలో ఆక్సాలిస్ యాసిడ్లు, ప్రోటీన్‌లు ఉన్నాయి. తానికాయలని కాస్త కాల్చి చూర్ణంగా చేసుకొని కాసింత సైంధవ లవణాన్ని కలిపి సేవిస్తే విరోచనాలు క్షణాలలో తగ్గిపోతాయి. అలాగే సర్పి అనే చర్మ వ్యాధితో బాధ పడేవారు తానికాయని అరగదీసి ఆ గంధాన్ని లేపనంగా పూస్తే ఉపశమనం లభిస్తుంది.
తానికాయ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు, ఉబ్బసం నుండి ఉపశమనం లభించడమే కాకుండా శ్వాస సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయి.
తానికాయ చూర్ణంలో కొద్దిగా చక్కెరను వేసుకుని ప్రతిరోజూ టీస్పూన్ మోతాదులో తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది.
తానికాయ చూర్ణంలో కొద్దిగా తేనె కలుపుకని తీసుకుంటే గొంతులో నొప్పి, మంట తగ్గుతాయి. గొంతు బొంగురు పోవడం తగ్గుతుంది.
తానికాయ గింజల పప్పును రాత్రిపూట తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది.
తానికాయల చూర్ణాన్ని 10 గ్రాముల మోతాదులో తీసుకుంటే ఆస్తమా వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.
తానికాయ చూర్ణం, అశ్వగంధ చూర్ణం, పాత బెల్లం సమాన మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాతం వలన వచ్చే నొప్పులు తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365