Aloe Vera For Piles : మనలో చాలా మంది మొలల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కూర్చోవడానికి, నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం. ఇవి తీవ్రమైన నొప్పి, బాధను కలిగిస్తాయి. కొన్నిసార్లు ఈ మొలల నుండి రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది. మలబద్దకం, జంక్ ఫుడ్ ను తీసుకోవడం, ఎక్కువ సేపు కూర్చోవడం, అధిక బరువు, మసాలాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, నీటిని ఎక్కువగా తాగకపోవడం, వేడి శరీరతత్వం కలిగి ఉండడం వంటి వివిధ కారణాల చేత కూడా మొలల సమస్య తలెత్తుతుంది. మొలల సమస్య నుండి బయటపడడానికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమని చాలా మంది భావిస్తూ ఉంటారు.
కానీ ఒక చక్కటి ఇంటి చిట్కాను వాడడం వల్ల కూడా మనం చాలా సులభంగా మొలల సమస్య నుండి బయటపడవచ్చు. మొలల సమస్యను తగ్గించే ఈ చిట్కా ఏమిటి..దీని తయారీకి కావల్సిన పదార్థాలు.. అలాగే వాడే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కేవలం రెండు పదార్థాలనే ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను, ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును తీసుకోవాలి. తాజా కలబంద గుజ్జు అందుబాటులో లేని వారు రెడీమెడ్ గా లభించే కలబంద గుజ్జునైనా ఉపయోగించవచ్చు. ఇప్పుడు వీటిని అంతా కలిసేలా బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బాహ్య మొలలపై రాస్తూ మర్దనా చేయాలి.
కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉండే ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ చిట్కాను రెండు నుండి మూడు సార్లు వాడిన వెంటనే సమస్య తీవ్రత తగ్గడాన్ని మనం గమనించవచ్చు. ఈ చిట్కాను వాడడంవల్ల మొలల వల్ల కలిగే నొప్పి, మంట, దురద వంటి సమస్యలు తగ్గడంతో పాటు క్రమంగా మొలల కూడా తగ్గుతాయి. ఈ విధంగా ఈ చిట్కాను పాటిస్తూనే నీటిని ఎక్కువగా తాగాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్ ను, మసాలాలు, కారం కలిగిన పదార్థాలను తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మొలల సమస్యను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు.