Egg Face Pack : ముఖం అందంగా, కాంతివంతంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు కూడా. చర్మంపై ఉండే మృత కణాలు, మచ్చలు, మొటిమలు, ముడతలు, జిడ్డు తొలగిపోయి ముఖం అందంగా కనబడడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మార్కెట్ లో దొరికే సౌందర్య సాధనాలన్నింటినీ కొనుగోలు చేసి మరీ వాడుతూ ఉంటారు. వీటి వల్ల తాత్కాలిక ఫలితం మాత్రమే ఉంటుంది. అలాగే ఇవి అధిక ధరతో కూడుకున్నవి. ఈ సౌందర్య సాధనాలను వాడడానికి బదులుగా మన ఇంట్లో ఉండే వాటితోనే మన ముఖాన్ని అందంగా, తెల్లగా మార్చుకోవచ్చు.
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆహారంగా తీసుకునే గుడ్డుతో కూడా మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. గుడ్డును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. గుడ్డులోని తెల్లసొనను ఉపయోగించి మనం ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. తెల్లసొనతో ఫేస్ ఫ్యాక్ ను తయారు చేసి వాడడం వల్ల చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. ఈ ఫేస్ ఫ్యాక్ లు చర్మంపై ఉండే జిడ్డును తొలగించడంలో సహాయపడతాయి.
గుడ్డులోని తెల్లసొనను ముఖాన్ని ఫ్యాక్ లా వేసుకుని పూర్తిగా ఆరనివ్వాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముడతలు, జిడ్డు తొలగిపోయి చర్మం బిగుతుగా, అందంగా మారుతుంది. అలాగే గుడ్డు తెల్లసొనలో పాలు, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ముఖం అందం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో పెరుగు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. పెరుగును చిలికి బ్రష్ తో కానీ, చేత్తో కానీ ముఖానికి రాసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే పెరుగులో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఒక గంట తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. పెరుగును వాడడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది. అంతేకాకుండా పెరుగు చర్మానికి మాయిశ్చరైజర్ లా కూడా పని చేస్తుంది.
మన ఆహారంగా తీసుకునే టమాట కూడా చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని అందంగా కనబడేలా చేయడంలో సహాయపడుతుంది. టమాటాలో సహజ సిద్దంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖ అందాన్ని రెట్టింపు చేస్తాయి. టమాటాను రెండు ముక్కలుగా చేసి ముఖంపై రుద్దాలి. ఇలా చేసిన పావుగంట తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు, జిడ్డు, మొటిమలు తొలగిపోయి చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల ఆలా తక్కువ ఖర్చుతో మనం మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.