Masala Gutti Vankaya : గుత్తి వంకాయ.. దీనిని చూడగానే మనందరికీ దీనితో చేసే మసాలా కూరనే గుర్తుకు వస్తుంది. గుత్తి వంకాయతో చేసే మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూరను ఇష్టంగా తింటారు. గుత్తి వంకాయలతో మసాలా కూరను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా గుత్తి వంకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
గుత్తివంకాయలు – పావు కిలో, నూనె – 4 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, టమాటాలు – 2, ఉప్పు – తగినంత, కారం – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా మిశ్రమం తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు – 2, యాలకులు – 2, లవంగాలు – 3, ధనియాలు – 2 టీ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, గసగసాలు – ఒక టీ స్పూన్.
మసాలా గుత్తి వంకాయ కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలను ఒక దాని తరువాత ఒకటి వేసి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించిను దినుసులను చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత నీటిని వేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత టమాటాలను కూడా పేస్ట్ లా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అలాగే గుత్తి వంకాయలను కూడా నాలుగు భాగాలుగా చేసి ఉప్పు నీటిలో వేసి 20 నిమిషాల పాటు ఉంచాలి.
ఇప్పుడు ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె కాగిన తరువాత వంకాయలను, పసుపును, కొద్దిగా ఉప్పును వేసి కలపాలి. తరువాత కళాయిపై మూతను ఉంచి వంకాయలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వంకాయలను ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
తరువాత టమాట ఫ్యూరీని వేసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ను, అర టీ గ్లాస్ నీటిని వేసి కలపాలి. తరువాత కళాయిపై మూతను ఉంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత వేయించుకున్న వంకాయలను వేసి కలపాలి. తరువాత నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మసాలా గుత్తి వంకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో పాటు చపాతీ, రోటి, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసిన గుత్తి వంకాయ కూరను అందరూ ఇష్టంగా తింటారు.