వర్షాకాలంలో సహజంగానే అనేక బాక్టీరియల్, వైరల్ ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందుతుంటాయి. దీంతోపాటు పాదాలు ఎక్కువ సార్లు వర్షపు నీటిలో.. ముఖ్యంగా బురద, మురికి నీటిలో తడుస్తుంటాయి. దీంతో పాదాలకు ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. సూక్ష్మ క్రిములు నివాసం ఉంటాయి. కనుక ఈ సీజన్‌లో పాదాలను సురక్షితంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన చిట్కాలను పాటించాలి.
1. పాదాలపై సహజంగానే చర్మానికి సంబంధించిన మృత కణాలు ఉంటాయి. వర్షాకాలంలో అవి పాదాలకు అతుక్కుని పోతాయి. కనుక వాటిని వదిలించుకోవాలి. అందుకు గాను పాదాలను రోజూ స్క్రబ్బర్ సహాయంతో రుద్దాలి. తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తే పాదాలపై ఉండే మృత కణాలు పోతాయి. పాదాలు మృదువుగా మారుతాయి.
2. ఈ సీజన్‌లో పాదాలపై సూక్ష్మ క్రిములు ఎక్కువగా ఉంటాయి కనుక రోజూ వాటిని తొలగించుకోవాలి. అందుకు గాను పాదాలను తప్పనిసరిగా రోజూ వెచ్చని నీళ్లతో కడగాలి. ఒక బకెట్‌లో కొద్దిగా హిమాలయన్ సాల్ట్ వేసి అందులో పాదాలను 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో సూక్ష్మ క్రిములు నశిస్తాయి. లేదా వెచ్చని నీళ్లలోనూ పాదాలను ఉంచవచ్చు. దీంతో పాదాలపై ఉండే దుమ్ము, ధూళి కూడా పోయి పాదాలు అందంగా కనిపిస్తాయి.
3. రోజూ రాత్రి నిద్రించే ముందు పాదాలకు కొబ్బరినూనెను రాసి సాక్స్‌లు వేసుకోవాలి. ఉదయం వెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే పాదాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
4. కొబ్బరినూనెకు బదులుగా ఆల్మంగ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్‌ను కూడా వీలును బట్టి రాయవచ్చు. ఇవి కూడా పాదాలను సంరక్షిస్తాయి.
5. వేపాకులను తీసుకుని పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాయాలి. 30 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే పాదాలపై ఉండే సూక్ష్మ క్రిములు నశించి పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
6. వర్షంలో కాళ్లు బాగా తడిచినా, మురికి నీళ్లలో కాళ్లను ఉంచినా, బురద నీటిలో తడుస్తూ వచ్చినా పాదాలు దురదగా మారుతాయి. అందుకు గాను కొద్దిగా నిమ్మ రసం, వెనిగర్ లను కలిపి దురద ఉన్న చోట రాయాలి. కొంత సేపు ఆగి వెచ్చని నీళ్లతో కడిగేయాలి. దీంతో దురద తగ్గుతుంది.
7. వర్షాకాలంలో షూస్ ధరించే వారి పాదాలకు ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక వారు రోజూ కొబ్బరినూనెను రాస్తుండాలి.
8. రోజ్ వాటర్, గ్లిజరిన్ లను సమాన భాగాల్లో తీసుకొని రాత్రి పూట పాదాలకు మర్దనా చేయాలి. మరుసటి రోజు ఉదయం వెచ్చని నీళ్లతో కడిగేయాలి. దీంతో పాదాలపై ఉండే మురికి సులభంగా పోతుంది. పాదాలు శుభ్రంగా మారుతాయి.