Cough : వయసుతో సంబంధం లేకుండా అందరిని వేధించే సమస్యల్లో దగ్గు కూడా ఒకటి. కొందరిలో దగ్గు 3 నుండి 4 రోజులు ఉండి ఆ తరువాత తగ్గుతుంది. కానీ కొందరిని శ్వాస ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అసలు దగ్గును చాలా మంది ఏదో ఒక పెద్ద సమస్యగా భావిస్తూ ఉంటారు. కానీ దగ్గు రావడమనేది మన రక్షణ వ్యవస్థలో ఒక ఏర్పాటనే చెప్పవచ్చు. హానికారక క్రిములు, రేణువులు నోటి ద్వారా, ముక్కు ద్వారా లోపలికి వెళ్లినప్పుడు అవి దగ్గు ద్వారా బయటకు నెట్టివేయబడతాయి. అలాగే మన శ్వాస మార్గంలో వచ్చే తెమడ, స్రావాలను దగ్గు ద్వారా బయటకు వస్తాయి. రెండు నుండి మూడు రోజుల పాటు దగ్గు వస్తే ఫ్లూ జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ ల వల్ల వచ్చే దగ్గుగా భావించాలి.
అదే వారం రోజుల పాటు వచ్చే దగ్గును అలర్జీ, బ్రాంకైటిస్ గా భావించాలి. అదే దగ్గు దీర్ఘకాలికంగా కొనసాగితే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. చల్లగాలి, దుమ్ము, ధూళి, పొగ, అలర్జీలు, ఇన్ఫెక్షన్ , రసాయనాలు వంటివి ఈ దగ్గుకు కారణం కావచ్చు. అలాగే ఆస్థమా, ఊపిరితిత్తుల్లో ఉండే సమస్యల కారణంగా కూడా దగ్గు వస్తుంది. మానసికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా కొందరిలో దగ్గు వస్తుంది. అలాగే హైబీపీకి వాడే మందులు కూడా ఒక్కోసారి దగ్గుకు కారణమవుతాయి. అలాగే జీర్ణాశయంలో ఎసిడిటీ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దగ్గు వస్తుంది. దగ్గుతో బాధపడే వారు ముందుగా దగ్గు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. తరువాత దానికి అనుగుణంగా చికిత్సను తీసుకోవాలి. గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి కలపాలి.
ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గడంతో పాటు దగ్గు కూడా తగ్గుతుంది. అలాగే వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం వల్ల దగ్గు తగ్గుతుంది. అలాగే నీటిలో తులసి ఆకులు, అల్లం ముక్కలు వేసి కషాయంలా చేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కూడా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గును ప్రేరేపించే చల్లటి పదార్థాలు, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి వాటికి దూరంగా ఉండడం వల్ల అలర్జీల కారణంగా వచ్చే దగ్గు రాకుండా ఉంటుంది. అలాగే నిద్రించేటప్పుడు తలగడ ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. నిద్రపోవడానికి ముందుగా గోరు వెచ్చని నీటిలో తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాత్రి పూట దగ్గు రాకుండా ఉంటుంది. మూడు నుండి నాలుగు రోజుల కంటే దగ్గు ఎక్కువగా వేధిస్తూ ఉంటే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.